చెక్కులో నగదు చూసి అవాక్కయిన రైతులు
జమ్ము: జమ్మూ రాష్ట్రంలో పలువురు రైతులు పంట మీదే ఆధారపడ్డారు. పంట పండితే ఈ ఏడాది కష్టాలుండవనుకున్నారు. పంట చేతికి వస్తుందని అనుకున్న తరుణంలో.. వరదల వచ్చి పడ్డాయి. రైతన్న ఆశలు ఆవిరయ్యాయి. గతేడాది సెప్టెంబర్లో జమ్మూ కాశ్మీర్లో రైతుల పరిస్థితి ఇది. నమ్ముకున్న పంట వరదల రూపంలో నట్టేటమునగడంతో రైతులు తీవ్ర నిరాశ చెందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పీడీపీ - బీజేపీ ప్రభుత్వం అదుకుంటుందని అంతా భావించారు. ప్రభుత్వం సదరు రైతులకు చెక్కులు అందజేసింది. ఆ చెక్కుల్లోని నగదు చూసి రైతులు అవాక్కయ్యారు.
ఒక్కో రైతుకు అక్షరాల రూ.32 చెక్కుల రూపంలో అందజేశారు. పంట నష్టం ఎక్కువ జరిగిన ఒకొక్క రైతుకు రూ.113 రూపాయిలు ఇచ్చారు. దీంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పంట నష్టంతో ఏర్పడిన పాత గాయాలను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ రేపుతుందని రైతులు ఆరోపించారు. రైతులు చెక్కులను తిరిగి వ్యవసాయశాఖకు అందజేశారు. తావీ నది వరదలతో వేలాది రూపాయిలు నష్టపోయిన తమను ఈ ప్రభుత్వం ఇంత తక్కువ నష్ట పరిహారం అందజేసి తమని అవమాన పరిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.