రహస్యాలను కాపాడుకోలేకే దెబ్బతిన్నాం
‘సాక్షి ’కి వెల్లడించిన మాజీ మావోయిస్టు జంపాల రవీందర్
సాక్షి,హైదరాబాద్: ప్రజల్లో మద్ధతు ఉన్నప్పటికీ తమ రహస్యాలను కాపాడు కోవడంలో మావోయిస్టులు విఫలమవ్వడం వల్లనే ఉమ్మడి ఏపీలో పార్టీ దెబ్బతిన్నదని ఇటీవల ప్రభుత్వానికి లొంగిపోయిన మాజీ మావోయిస్టు జంపాల రవీందర్ ఎలియాస్ అర్జున్ అభిప్రాయ పడ్డారు. మావోయిస్టు పార్టీలో సైద్ధాంతికంగా శిక్షణనిచ్చేవారు కరువయ్యారని, విద్యావంతుల రిక్రూట్మెంట్ కూడా తక్కువైందనీ అన్నారు.
రవీందర్ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ, మిలట్రీ కమిషన్లోనూ సభ్యునిగా పనిచేశారు.ఆయన తనభార్య అడిమితో కలసి గురువారం వనస్థలిపురంలో ‘సాక్షి’తో మాట్లాడారు.ఇరవై ఏళ్ల కిందట పార్టీలో సిద్ధాంత నిబద్ధత కలిగిన వారు పుష్కలంగా ఉండేవారనీ వారు కింది స్థాయి కేడర్‌కు శిక్షణ నిచ్చేవారని తెలిపారు. పలు ఎన్కౌంటర్లలో సుశిక్షితులైన నేతలు నేలకొరగడంతో ఆ లోటు కనిపిస్తోందన్నారు. తాను మోకాళ్ల నొప్పులు, భార్య అడిమి టీబీ ఇబ్బందులు పడుతున్నామనీ ఈ కారణంగానే పార్టీనుంచి వెలికి వచ్చామన్నారు.