నోట్ల రద్దుపై ఉర్జిత్ ఆ రోజు పెదవిప్పాల్సిందే!
పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన పరిణామాలపై ఆర్బీఐ గవర్నర్ మౌనంగా ఉండటాన్ని పలువురు పలు రకాలుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మౌనం సెంట్రల్ బ్యాంకు స్వతంత్రను దెబ్బతీస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించే సమయం ఆసన్నమైంది. నోట్ల రద్దుతో ఏర్పడిన పరిణామాలపై ఉర్జిత్ పటేల్ వివరణ ఇవ్వాలని ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) ఆదేశించింది. ఈ మేరకు జనవరి 20వ తేదీన పెద్ద నోట్ల రద్దుపై ఏర్పడిన పరిణామాలపై పీఏసీ చర్చించనుందని కమిటీ చైర్మన్ కేవీ థామస్ చెప్పారు. ఈ మీటింగ్‌లో ఆర్బీఐ గవర్నర్, సంబంధిత అధికారులు ఇచ్చే వివరణను బట్టి కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందని థామస్ తెలిపారు. నోట్ల రద్దుపై పీఏసీ సభ్యులు సంధించిన పలు ప్రశ్నలను ఇప్పటికే రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు, ఆర్థిక, రెవెన్యూ కార్యదర్శులకు పంపినట్టు థామస్ వెల్లడించారు. ఒకవేళ వీరిచ్చే వివరణకు కమిటీ సంతృప్తి చెందని పక్షంలో ప్రధాని నరేంద్రమోదీని సైతం ప్రశ్నించాలని పీఏసీ భావిస్తోంది.
ఈ మీటింగ్‌కు గవర్నర్, సంబంధిత అధికారులను జనవరి 20న కమిటీ ముందు హాజరుకావాలని పీఏసీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దుతో ఎంత మొత్తంలో నల్లధనం బయటికి వచ్చింది? ఎంతమొత్తం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చిందో తెలుపుతూ వివరణ ఇవ్వాలని ఆర్బీఐ గవర్నర్‌ను, సంబంధిత అధికారులను ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు.. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, నోట్ల రద్దుకు దారితీసిన కారణాలు చెప్పాలని పీఏసీ ప్రశ్నించింది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ విచారిస్తోంది. గత శుక్రవారం రాజ్యసభ స్టాండింగ్ కమిటీ కూడా పటేల్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్, ఆర్.గాంధీలనూ నోట్లరద్దుపైనే ప్రశ్నించింది. అయితే కమిటీ వేసిన పలు ప్రశ్నలకు ఆర్బీఐ అధికారుల వద్దనుంచి సరైన సమాధానం రాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.