ఏటీవీఎంలకు ఆదరణ
సాక్షి, ముంబై: లోకల్‌రైళ్ల టికెట్ల బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు సెంట్రల్ రైల్వే ప్రవేశపెట్టిన వివిధ పథకాలకు మంచి స్పందన లభిస్తోంది. ఫలితంగా సాధారణ కౌంటర్ల వద్ద టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికుల సంఖ్య 50 శాతానికి తగ్గిందని అధికారులు వెల్లడించారు. ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ఏటీవీఎం), జన్సాధారణ్ టికెట్ బుకింగ్ సేవక్ (జేటీబీఎస్) ద్వారా టికెట్లు కొనే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. వీటిని ప్రవేశపెట్టిన తరువాత ప్రయాణికులు టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద క్యూలో నిల్చొని టికెట్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే సెంట్రల్ రైల్వే పరిధిలోని స్టేషన్లలో నిత్యం దాదాపు 9.5 లక్షల మంది ప్రయాణికులు టికెట్లను కొనుగోలు చేస్తుంటారు.
వీరిలో 55 శాతం మంది టికెట్ బుకింగ్ కౌంటర్ల ద్వారా టికెట్లను కొనుగోలు చేస్తుంటారు. గత ఏడాది టికెట్ బుకింగ్ కౌంటర్ల ద్వారా 65 శాతం మంది ప్రయాణికులు టికెట్లు కొనుగోలు కేయగా, ఈ ఏడాది 55 శాతం మంది మాత్రమే కొనుగోలు చేశారని అధికారి ఒకరు తెలిపారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే చాలా మంది ప్రయాణికులు ఏటీవీఎంలు, జేటీబీఎస్‌ల ద్వారానే టికెట్లను కొనుగోలు చేస్తున్నట్టు స్పష్టమవుతోందని సెంట్రల్రైల్వే సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి కల్లా జేటీబీఎస్, ఏటీవీఎంల టికెట్ల విక్రయాన్ని పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రయాణికులు టికెట్ల కౌంటర్ల వద్ద క్యూల్లో నిల్చుని టికెట్ కొనుగోలు చేసే సమయం లేకపోవడంతో వీటికి ఆదరణ తగ్గిందని ముంబై రైల్ వికాస్ కార్పొరేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
అయితే గతంలో 66 శాతం మంది ప్రయాణికులు రైల్వే ప్రవేశపెట్టిన టికెట్ కొనుగోల యంత్రాలు, విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సదుపాయాలను నవీకరించడంతో పరిస్థితి మెరుగుపడిందని సీఆర్ అధికారి ఒకరు తెలిపారు. గత రెండు నెలల క్రితం వివిధ రైల్వే స్టేషన్లలో 130 ఏటీవీఎంలను ఏర్పాటు చేశామన్నారు. ముంబై డివిజన్లో ప్రస్తుతం 385 ఏటీవీఎంలు ఉన్నాయని పాటిల్ తెలిపారు. ఈ ఏడాదిలోపు కూపన్ వాలిడేటింగ్ మెషీన్లను (సీబీఎం) తొలగించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. గత రెండేళ్లుగా సీవీఎంల ద్వారా టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. ఇదిలా ఉండగా సెంట్రల్ రైల్వే పరిధిలో 164 జేటీబీఎస్‌లు ఉన్నాయి. 2012 సెప్టెంబర్ నుంచి ఈ పథకం ద్వారా టికెట్ కొనుగోలు చేసే వారి సంఖ్య 50 శాతానికి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. దుకాణాలు, ఇతర ప్రైవేట్ సంస్థలు జేటీబీఎస్‌ల ద్వారా టికెట్ విక్రయించుకోవడానికి రైల్వే అనుమతించింది. అంతేకాకుండా సీజన్పాస్ల నవీకరణ కోసం కూడా అనుమతించింది. ఫలితంగా దుకాణదారులు ఒక్కో పాస్‌కు రూపాయి చొప్పున కమీషన్ పొందవచ్చు.