breaking news
Jan Suraaj Party (JSP)
-
Bihar Election: ఎన్డీఏ, మహాకూటమిపై పీకే సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్‌లో ఎన్నికల వేడి నెలకొంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, రాష్ట్రంలోని పార్టీలన్నీ రాజకీయ సందడి చేస్తున్నాయి. తాజాగా జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్(పీకే) ఎన్డీఏ, మహాకూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ, తమ ‘జన్ సురాజ్’ పార్టీల మధ్యనే ఉంటుందని, మహాకూటమి ఓటమిపాలై, మూడో స్థానంలో నిలుస్తుందని జోస్యం చెప్పారు.ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త, జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్(మహాకూటమి) రాబోయే ఎన్నికల్లో ఓటమిపాలై మూడో స్థానంలో నిలుస్తుందన్నారు. తాము ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని సందర్శిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో మహాకూటమి మూడవ స్థానంలో ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ, జన్ సురాజ్ మధ్యనే ఉంటుందన్నారు. గత ఐదు రోజుల్లో తేజస్వి యాదవ్ చేసిన ప్రకటనల్లో అస్సలు అర్థం లేదని, వీటిపై ఎవరూ ఆసక్తి చూపడం లేదన్నారు.దీనికి ముందు మధుబనిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ బీహార్ ఓటర్లు నితీష్ కుమార్, బీజేపీ, లాలు యాదవ్‌ల ఆధిపత్య పార్టీల రాజకీయాలను దాటి వెళుతున్నారని అన్నారు. రాష్ట్ర యువతపై తటస్థ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటున్నదన్నారు. బీహార్‌లో కొత్త రాజకీయ చరిత్రను అంతా చూస్తారని.. లాలు, నితీష్,బీజేపీలకు భయపడి ఓటు వేసిన 30 ఏళ్ల యుగం ముగియబోతున్నదన్నారు. కొత్త ప్రత్యామ్నాయం ఉద్భవిస్తోందని, దాని నేత.. ఏ నాయకుడు, కుటుంబం లేదా కులానికి చెందినవాడు కాదని, బీహార్‌కు చెందినవాడేనని అన్నారు. జన్ సురాజ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, జీవనోపాధి కోసం ఎవరూ రాష్ట్రాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదని కిషోర్ పేర్కొన్నారు. #WATCH | Purnea, Bihar | On #BiharAssemblyElections, Jan Suraaj founder Prashant Kishor says, "We are visiting every assembly constituency. Mahagathbandhan is in the third position. The fight is between NDA and Jan Suraaj. The announcements made by Tejashwi Yadav in the last 5… pic.twitter.com/9I3DWgpzfU— ANI (@ANI) October 27, 2025 -
బీహార్‌లో బిగ్ ట్విస్ట్.. బీజేపీ బెదిరింపుల వల్లే తప్పుకున్నాం: పీకే సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్ ఎన్నికల్లో(bihar Assembly Election) బీజేపీ ఒత్తిళ్ల కారణంగానే తాము ముగ్గురు అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయాల్సి వచ్చిందని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(prashant Kishor) ఆరోపించారు. మంగళవారం ఆయన పట్నాలో మీడియాతో మాట్లాడారు. దానాపూర్, బ్రహాంపూర్, గోపాల్‌గంజ్ సీట్ల నుంచి ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఓటమి భయంతోనే ఎన్డీయే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు గురి చేస్తోందన్నారు.ఈ సందర్బంగా ప్రశాంత్ కిషోర్.. ‘ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఇలాంటి పరిణామాలు దేశంలో ఇంతకుముందెన్నడూ జరగలేదు. ఎన్నికల సంఘం అభ్యర్థులకు తగు భద్రత కల్పించాలి’ అని ఆయన కోరారు. ఆదివారం వరకు పార్టీ తరఫున చురుగ్గా పనిచేసిన బ్రహాంపూర్‌లో తమ అభ్యర్థి సత్యప్రకాశ్ తివారీ సోమవారం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ(BJP Party) ఎన్నికల ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం తివారీ ఇంటికి వెళ్లి తీవ్రంగా బెదిరించారన్నారు.బీజేపీ నేతలు బెదిరింపుల వల్లే పోటీ నుంచి వైదొలగుతున్నట్లు గోపాల్‌గంజ్‌లోని తమ అభ్యర్థి శేఖర్ సిన్హా, దాన్‌పూర్‌లో అభ్యర్థి అఖిలేశ్ షా తనకు చెప్పారని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని, ప్రజల్లో సడలుతున్న విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పాలన్నారు. అభ్యర్థులనే కాపాడలేని ఈసీ, ఓటర్లకు ఎలా రక్షణ కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించింది. ఎవరూ పట్టించుకోవడం లేదని భావించిన ప్రశాంత్ కిశోర్ బీజేపీ నేతలపై ఆరోపణల ద్వారా ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. -
ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం
మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(prashant kishor) సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ ప్రకటించారాయన. తాజాగా ఆ పార్టీ తరఫున అభ్యర్థుల రెండో జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. అందులోనూ ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బరిలో నిల్చోవడం లేదంటూ స్పష్టత ఇచ్చారాయన. పోటీకి బదులు తనను సంస్థాగత పనులపై దృష్టిసారించాలని పార్టీ నిర్ణయించింది అని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ఒకవేళ తాను ఎన్నికల్లో గనుక పోటీ చేస్తే తన స్వస్థలం కర్గాహర్ లేదంటే రాఘోపూర్ నుంచి పోటీ చేస్తానని గతంలో చెప్పారు. రాఘోపూర్ ఆర్జేడీ కంచుకోట. వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి నెగ్గిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్.. హ్యాట్రిక్‌పై కన్నేశారు. అయితే.. జన్ సురాజ్ తరఫున ప్రశాంత్ కిషోర్ పోటీ చేయబోతున్నారని ప్రచారం నడిచింది. కానీ, జన్ సురాజ్ రెండో జాబితాలో రాఘోపూర్ నుంచి చంచల్ సింగ్ పేరును ప్రకటించారు. దీంతో ఆ ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది. అయితే పోటీ చేయకున్నా పార్టీని బలోపేతం చేయడానికి.. ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి తాను కృషి చేస్తానని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారాయన. జేడీయూకి ఎలాంటి ఓటమి దక్కబోతోందో చెప్పడానికి సెఫాలజిస్ట్( ఎన్నికల విశ్లేషకుడు) అయి ఉండాల్సిన అవసరమేమీ లేదని అన్నారాయన. అలాగే జన్ సురాజ్‌పార్టీ లక్ష్యం భారీదని, 150 స్థానాలకు ఒక్క సీటు తగ్గినా తమ పార్టీ ఓడిపోయినట్లేనని పీకే ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
రాహుల్ లాగే తేజస్వీకి ఓటమి తప్పదు
రాయపూర్: ఆరేళ్ల క్రితం అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓడినట్లుగానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు పరాజయం తప్పదని జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. వైశాలి జిల్లా రఘోపూర్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో తేజస్వీ ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుండి పోటీ చేయవచ్చని పుకార్లు వస్తున్నాయని విలేకరులు అడగ్గా.., ప్రశాంత్ కిషోర్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘‘మా పార్టీ ఇక్కడ బలమైన అభ్యర్థిని పోటీకి దింపుతుందనే ఊహాగానాలకే తేజస్వీ భయపడుతున్నారు. వారిని రెండు చోట్ల పోటీ చేయనీయండి. 2019లో రాహుల్ గాంధీ కూడా వయనాడ్, అమేథీలో పోటీ చేశారు. కాంగ్రెస్‌కు 15 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్ గాంధీ, బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో అవమానకర రీతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆర్జేడీకి, తేజస్వీ యాదవ్‌కు కూడా అదే గతి పడుతుంది’’ అన్నారు. రఘోపూర్ నియోజకవర్గంలో తేజ్వసీ కుటుంబం దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తోందని ఆరోపించారు. అయినప్పట్టకీ ఈ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా వారసత్వ పాలనకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పవన్ సింగ్ శత్రువు కాదుభోజ్పురి సూపర్‌స్టార్ పవన్ తనకు శత్రువు కాదన్నారు. ఆయన వ్యక్తిగతంగా మిత్రుడేనని, బీజేపీలో ఉన్నారనేదానిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పవన్ సింగ్ భార్య తన అభద్రతా భావాలను పంచుకోవడానికి వచ్చినప్పుడు, తాను ఒక సోదరుడిలా హామీ ఇచ్చానన్నారు. తాను కానీ, జన్ సురాజ్ పార్టీ వారి వివాహ వివాదంలో ఎలాంటి జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు.ఆశావహుల్లో అసంతృప్తి సహజంరెండురోజుల క్రితం పార్టీ 51 మంది అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేసిన ఆశావహులను తేలికగా తీసుకున్నారు. ఇది ప్రతిపార్టీలోనూ సహజమని అన్నారు. వేలాది మంది రక్తం, కన్నీళ్లు, చెమటతో జన్ సురాజ్ పార్టీ నిర్మాణం జరిగిందన్నారు. అసెంబ్లీలో కేవలం 243 సీట్లు మాత్రమే ఉన్నప్పుడు వారందరికీ అవకాశం కల్పించడం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. తమ పార్టీ అత్యంత పారదర్శక ప్రజాస్వామ్య పార్టీ సిద్ధాంతాలు కలిగి ఉందన్నారు. ప్రతీ సమస్య పరిష్కరిస్తామన్నారు.పోటీపై పార్టీదే తుది నిర్ణయంజన్ సురాజ్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఆదివారం(ఇవాళ) జరుగుతుందన్నారు. రఘోపుర్ నుంచి తనకు వచ్చే అభిప్రాయం కూడా చర్చకు వస్తుందన్నారు. దాని ఆధారంగా, అత్యంత అనుకూలమైన అభ్యర్థిని నిర్ణయిస్తారని, అది తానేనేనా అని చెప్పలేనని అన్నారు. ఆ నిర్ణయం పార్టీ తీసుకోవాలని చెప్పారు. -
డెబ్యూతోనే పెద్ద రిస్క్!! పీకే ఏమన్నారంటే..
అదేదో సినిమాలో.. ఏమాత్రం రాజకీయానుభవం లేనివాళ్లను ఎన్నికల్లో నిలబెట్టి గెలిచి.. చివరకు తాను కాకుండా ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని సీఎం చేస్తాడు క్లైమాక్స్‌లో హీరో. బీహార్ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఈ సీన్‌ను ప్రస్తావిస్తున్నారు పలువురు. ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్త(మాజీ).. తన పార్టీ జన్ సురాజ్ తరఫున అభ్యర్థుల ప్రకటనే ఇందుకు ప్రధాన కారణం. ప్రశాంత్ కిషోర్(prashant kishor).. బీహార్ ఎన్నికల బరిలో తొలిసారి తన జన సురాజ్ పార్టీని ఒంటరిగా పోటీకి నిలిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోసం 51 మందితో కూడిన తొలి జాబితాను రిలీజ్ చేశారాయన. అందులో.. ప్రముఖ మ్యాథ్స్ ప్రొఫెసర్ కేసీ సిన్హా(పాట్నా వర్సిటీ మాజీ వీసీ), మాజీ అడ్వొకేట్ జనరల్ వైబీ గిరి, రితేష్ రంజన్ పాండే (బోజ్‌పురి గాయకుడు)తో పాటు డాక్టర్లు, లాయర్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, పోలీస్ అధికారులు సైతం ఉన్నారు. ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే..గోపాల్‌గంజ్ భోరే నియోజక వర్గంలో జన్ సురాజ్(Jan Suraaj Party) తరఫున పోటీ చేయబోతున్న ప్రీతి కిన్నర్(Preeti Kinnar).. ఈ జాబితాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎందుకంటే.. ఆమె ఓ ట్రాన్స్‌జెండర్ కాబట్టి. ప్రీతి కిన్నర్.. స్వస్థలం కల్యాణ్‌పూర్. ట్రాన్స్జెండర్ల నాయకురాలిగా.. సామాజిక వేత్తగా స్థానికంగా ఆమెకు మంచి పేరుంది. ఇంతకీ ఆమె పోటీ చేయబోతోంది ఎవరి మీదనో తెలుసా?.. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సునీల్ కుమార్ మీద. అందుకే ఆమె గురించి ప్రత్యేకంగా చర్చ నడుస్తోంది. అయితే.. స్థానిక సమస్యలపై ఆమెకు అవగాహన ఉండడం కలిసొచ్చే అంశమని జన్ సురాజ్ భావిస్తోంది.గెలిచిన దాఖలాల్లేవ్!రాజకీయాల్లో ట్రాన్స్జెండర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు అత్యంత అరుదనే చెప్పాలి. 1998 మధ్యప్రదేశ్ ఎలక్షన్స్‌లో శబ్నం మౌసీ సోహగ్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. 2015లో మధు కిన్నర్ చత్తీస్‌గఢ్ రాయ్‌ఘడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నెగ్గి.. మేయర్ పదవి చేపట్టారు కూడా. అయితే.. ఆ తర్వాతే ఆ వర్గం నుంచి చెప్పుకోదగ్గ విజయాలేవీ నమోదు కాలేదు.2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నుంచి రాజన్ సింగ్ పోటీ చేసి.. కేవలం 85 ఓట్లే దక్కించుకున్నారు. ఈ తరుణంలో ప్రీతి కిన్నర్.. అదీ జన్ సురాజ్ నుంచి బీహార్ ఎన్నికల బరిలో దిగడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ప్రీతి కిన్నర్(ఎడమ), ప్రొఫెసర్ కేసీ సిన్హా(మధ్యలో), సింగర్ రితేష్ రంజన్ పాండే(చివర.. కుడి)రిస్క్‌పై పీకే ఏమన్నారంటే.. జన్ సురాజ్ తొలి జాబితాలో.. సామాజిక న్యాయం వరకు అయితే బాగానే జరిగింది. 17 మంది ఈబీసీలు, 11 మంది బీసీలు, 9 మంది మైనారిటీలు, ఏడుగురు షెడ్యూల్ కాస్ట్(ప్రీతి కూడా), ఎనిమిది మంది ఇతర వర్గాల వాళ్లు ఉన్నారు. ‘‘జన సురాజ్ అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో ఓట్లు పడకపోతే.. అది నా తప్పేం కాదు. అది ముమ్మాటికీ బీహార్ ఓటర్లదే’’ అని ప్రశాంత్ కిషోర్ తేల్చేశారు. ‘పార్టీకి సరైన గుర్తింపు లేదు, ప్రచార నిధులు పరిమితంగా ఉన్నాయి. పైగా అవతల జేడీయూ, ఆర్జేడీ, బీజేపీ లాంటి పార్టీలు ఉండగా.. ఎన్నికల్లో కొత్త ముఖాలతో వెళ్లడం రిస్క్ కాదా?’ అనే మీడియా ప్రశ్నకు ఆయన పైబదులు ఇచ్చారు. అవినీతి నిర్మూలన, ప్రజా సమస్యల పరిష్కారం నినాదాలతో ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నారు. అక్టోబర్ 11న, రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ప్రశాంత్ కిషోర్ ప్రచారం ప్రారంభించనున్నారు. ఆయన పేరు తొలి జాబితాలో లేదు, కానీ రెండో జాబితాలో ఉండే అవకాశం ఉందని పార్టీ తెలిపింది. నవంబర్ 6, 11.. రెండు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections 2025) జరగనున్నాయి. నవంబర్ 14వ తేదీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదీ చదవండి: మాయావతి ఎంట్రీ.. సీన్ మారేనా? -
Bihar Elections: ‘పీకే’ తొలి జాబితాలో 51 మంది అభ్యర్థులు
పట్నా: బీహార్‌లో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో సందిడి నెలకొంది. పార్టీలలో చేరికలు కొనసాగుతున్నాయి. పోటీలో దిగేందుకు పలువురు నేతలు ఉబలాటపడుతున్నారు. ఈ నేపధ్యంలో రాజకీయ నేత ప్రశాంత్ కిషోర్(పీకే)కు చెందిన జన్ సురాజ్ పార్టీ 51 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. వీరిలో 16 శాతం ముస్లిం అభ్యర్థులు ఉన్నారు.‘పీకే’ ప్రకటించిన తొలి జాబితాలో మాజీ అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, వైద్యులు మొదలైనవారు ఉన్నారు. వచ్చే నెలలో బీహార్‌లో జరగబోయే రెండు దశల ఎన్నికల్లో పోటీచేయబోయే జన్ సురాజ్ అభ్యర్థుల మొదటి జాబితా ఇది. ఈ జాబితాలో 16 శాతం ముస్లిం అభ్యర్థులతో పాటు 17 శాతం మంది వెనుకబడిన వర్గాలకు చెందినవారున్నారు. ఎన్నికల వ్యూహకర్త నుండి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో పేరుకుపోయిన అవినీతిని ఎత్తిచూపారు. ఈ నేపధ్యంలోనే పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు వారి క్లీన్ ఇమేజ్ కీలక అంశంగా గుర్తించారు. जन सुराज के उम्मीदवारों की पहली सूची। pic.twitter.com/5VFYHHWm1W— Jan Suraaj (@jansuraajonline) October 9, 2025ఇదిలావుండగా బీహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని ప్రశాంత్ కిశోర్ ఇటీవల స్పష్టం చేశారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)తో జతకడతారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తమ కూటమి ప్రజలతోనే ఉంటుందని అన్నారు. బీహార్‌ను దోచుకోవడానికే పోరాటం జరుగుతోందని, ఇది సీట్ల కోసం జరుగుతున్న యుద్ధం కాదని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలపై తీవ్ర చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రశాంత్ కిశోర్, చిరాగ్ పాశ్వాన్ మధ్య పొత్తు కుదరవచ్చనే ప్రచారం జరిగింది. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్, మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీకి 40 సీట్లు కేటాయించాలని కోరుతున్నారని సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు స్థానాల్లోనూ తాము గెలిచామని, ఈసారి కూడా తమకు అదే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని పాశ్వాన్ డిమాండ్ చేస్తున్నారు. -
బీహార్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టత ఇచ్చిన ఆయన.. నితీశ్ కుమార్‌కు ఇవి ఫేర్వెల్ ఎలక్షన్స్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో.. తాము అధికారంలోకి వస్తే గనుక అవినీతిపరుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ఓ ప్రకటన చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ‘‘మోదీ, నితీశ్, లాలూ వీళ్ల కోసం ఓట్లు వేయొద్దు. ఈ ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం. వలసలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ఒక్కసారి ఆలోచన చేయండి. కొత్త భవిష్యత్తు కోసం ఓటు వేయండి’’ బీహార్ ఓటర్లకు ప్రశాంత్ కిషోర్ పిలుపు ఇచ్చారు.జన్ సురాజ్ పార్టీ(Jan Suraaj Party) ఈ ఎన్నికల్లో 48% ఓట్లు దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారాయన. ఇది బీహార్‌కు కొత్త అధ్యాయం అని, జన సురాజ్ పార్టీ నేతృత్వంలో తాము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం అవినీతి రాజకీయ నాయకులు, అధికారులపై విచారణ జరిపించి వాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. అలాగే.. బీహార్‌ను దేశంలో టాప్ 10 రాష్ట్రాల్లోకి తీసుకెళ్లే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఇదే చివరి ఎన్నికలని, ఆయన ఇక ముఖ్యమంత్రి పదవిలో ఉండరని, ఈ ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని ప్రశాంత్ కిషోర్ ధీమాగా ప్రకటించారు. బహుశా.. పట్నా మెట్రో ప్రారంభం సీఎంగా నితీశ్ చివరి కార్యక్రమం అంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Election 2025) ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేయబోతున్నారు. అక్టోబర్ 9వ తేదీన జన్ సురాజ్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించారాయన.బీహార్ అసెంబ్లీని రెండు విడతల్లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది. బీహార్ అసెంబ్లీ మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అంటే మెజారిటీ మార్క్ 122 సీట్లు. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగియనుంది. ప్రస్తుతానికి.. అధికార ఎన్డీయే కూటమికి 131 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమికి 111 సీట్లు, మిగిలినవి ఇతరులు ఉన్నారు.అధికారంలో కొనసాగాలని ఎన్డీయే కూటమి(జేడీ(యూ)+బీజేపీ), అధికారం చేజిక్కించుకోవాలని ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్ష మహాఘట్బంధన్ కూటమి, అవినీతి.. ప్రజా సమస్యలే ప్రదాన అజెండా తొలిసారి పోటీకి దిగుతున్న జన్ సురాజ్‌తో త్రిముఖ పోటీ హోరాహోరీగానే నడవచ్చనే విశ్లేషణలు నడుస్తున్నాయక్కడ. ఇదీ చదవండి: బీహార్ ఎన్నికల్లో.. తొలిసారిగా ఈసీఐ నెట్!


