గ్రామాలు అభివృద్ధి సాధించాలి
ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్
రోంపల్లిలో జనమైత్రి.. వైద్య శిబిరం
తిర్యాణి : మారుమూల గిరిజన గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. జనమైత్రి కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని రోంపల్లి గ్రామంలో మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు సౌకర్యం లేకుంటే గ్రామాలు ప్రగతి సాధించలేవని, రోడ్డు సౌకర్యం కల్పించడానికి పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గుండాల గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడానికి కృషి చేశామని, దండేపల్లి మండలం ఊట్ల గ్రామం నుంచి రోడ్డు పనులు సాగుతున్నాయని వివరించారు.
జిల్లాలోని కల్వర్టులు, లోలెవల్ వంతెనలు, వాగులపై బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధిత అధికారులతో మాట్లాడి రవాణా సౌకర్యం మెరుగుపర్చడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులని, వారికి ఎవరూ సహకరించవద్దని అన్నారు. కరీంనగర్‌కు చెందిన సన్‌రైజ్, స్టార్, అపోలో ఆస్పత్రి వైద్యులు 802 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నలుగురిని మెరుగైన చికిత్స కోసం తరలించారు.
వృద్ధులకు దుప్పట్లు, దోతులు, చీరెలు, విద్యార్థులకు ప్యాడ్లు, పెన్లు, అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. బెల్లంపల్లి డీఎస్పీ రమణారెడ్డి, తాండూర్ సీఐ కరుణాకర్, ఎస్సైలు బుద్దే స్వామి, సురేష్, రోంపల్లి జేపీవో కిరణ్ , వైద్యులు వెంకటేష్, స్పురణ, రజిత, సురేష్‌కుమార్, ఆంజనేయులు, మైఖేల్, శ్రీనివాస్, సర్పంచ్‌లు కుర్సింగ దేవు, వెన్న కమల, గ్రామ పటేల్‌లు జలపతి, దౌలత్, మాజీ సర్పంచ్ దిందర్షా పాల్గొన్నారు.
గుండాలను సందర్శించిన ఎస్పీ
మండలంలోని గుండాల గ్రామాన్ని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ గురువారం సందర్శించారు. రోంపల్లిలో వైద్యశిబిరం ప్రారంబించి అక్కడి నుంచి గుండాలకు కాలినడన చేరుకుని గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. దండేపల్లి మండలం ఊట్ల గ్రామం నుంచి గుండాల వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు.