janardhan redddy
-
TSPSC: జనార్ధన్ రెడ్డి రాజీనామా.. ట్విస్ట్ ఇచ్చిన తమిళిసై
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)పై కాసేపట్లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష జరపనుండగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. TSPSC చైర్మన్ బి. జనార్ధన్‌రెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఇప్పటికే జనార్ధన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే గవర్నర్ రాజీనామా తిరస్కరించడంతో సీఎం జరిపే సమీక్షకు జనార్ధన్‌రెడ్డి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, రాతపరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీ, తదుపరి నియామక ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డి కాసేపట్లో సచివాలయంలో సమీక్షించనున్నారు. గ్రూప్-2 పోటీ పరీక్షలు, గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ,గ్రూప్-3 షెడ్యూలు ఖరారు, ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. కాగా, జనార్దన్‌రెడ్డి సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా లేఖను అందజేశారు. ఇదీచదవండి..ఫైల్స్ చోరీ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన తలసాని ఓఎస్డీ -
కొత్త సంవత్సరంలో... జీఎస్టీ మోత
నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై 2022, జనవరి 1 నుంచి కేంద్రం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో మోయ లేని భారం మోపనుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చేంత వరకు... చేనేత, జౌళి, పాదరక్షల రంగాలపై కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పన్నులు వేయలేదు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని మొదట అమల్లోకి తీసుకొచ్చినప్పుడు 5 శాతం పన్ను మోపింది. దీన్ని జనవరి 1, 2022 నుంచి 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పన్నుల పెంపుదల వల్ల అసంఘటిత రంగంలోని చేనేత, జౌళి, పాదరక్షల ఉత్పత్తుల అమ్మకాలకు గడ్డు కాలం రానుంది. కంచి, బెనారస్, బెంగాల్, పోచంపల్లి, గద్వాల్, నారా యణపేట, వెంకటగిరి, ధర్మవరం లాంటి పట్టు, కాటన్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇకపై ఆన్లైన్, ఈ–కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా పొందే సేవలపై కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే. స్విగ్గీ, జొమోటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా లాంటి వాటి ద్వారా పొందే సేవల పైనా; ట్రాన్స్‌పోర్టు రంగంలో ఉన్న ఓలా, ఊబెర్ సంస్థలు అందించే సేవల పైనా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. కరోనా వల్ల ఇప్పటికే కుదేలైన మోటారు రంగంపై ఈ భారం మోయలేనిది. ఒక పక్క గ్యాస్ ధరలు, మరోపక్క జీఎస్టీ పెంపుదలతో హోటల్ రంగానికి కూడా ఇకపై గడ్డుకాలమే. కరోనా వల్ల కుదేలైన పర్యాటక రంగానికి జీఎస్టీని పెంచడం చేదు వార్తే. జీఎస్టీ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం... పన్నుల పెంపు, హేతుబద్ధత, వ్యత్యాసాల తొలగింపు నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకనుంచీ పన్నుల రీఫండ్ మార్పుల కోసం ఆధార్ అనుసంధానం తప్పనిసరి. వరసగా రెండు నెలలు జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే.. మూడో నెల బ్లాక్ లిస్ట్‌లో ఉంచుతారు. అంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో జీఎస్టీ దాఖలు చేయకపోతే జనవరిలో బ్లాక్‌లిస్ట్‌లోకి వెళతారు. ఎలాంటి షోకాజ్ నోటీసు లేకుండా స్థిర, చర ఆస్తులు జప్తు చేసే అధికారం జీఎస్టీ కమిషనర్‌కు దఖలు పరిచారు. తనకు కావాల్సిన సమాచారం ఏ వ్యక్తి, సంస్థ నుంచైనా రాబట్టే అధికారం జీఎస్టీ కమిషనర్‌కు ఉంటుంది. ఈ జప్తుకు సంబంధించిన కారణాలు, పెనాల్టీలు ఏడు రోజుల్లో తెలియజేస్తారు. ఇకపై పెనాల్టీలు, ఇతర అభ్యంత రాలు కోర్టులు, ట్రిబ్యునల్‌లలో దావా దాఖలుకు 25 శాతం పెనాల్టీ పన్ను లేదా క్లయిం విలువను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా తుది సప్లయ ర్కు జీఎస్టీ ఇన్వాయిస్ను, డెబిట్ నోటు విధిగా మొదటి సరఫరా దారు తెలియపర్చాల్సి ఉంటుంది. ఈ మార్పులతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఉత్పత్తి, వ్యాపార సంస్థలను జీఎస్టీ 12 శాతం శ్లాబులోకి; కేంద్ర పరోక్ష పన్నుల, సుంకాల పరిధిలోకి పూర్తిగా తీసుకురావడం కేంద్ర ఉద్దేశం. పొనకా జనార్దన్‌రెడ్డి వ్యాసకర్త ఏపీ హైకోర్టు న్యాయవాది, తాడేపల్లి మొబైల్: 83094 09689 -
ఓటర్లు ఎవరిని కరుణిస్తారో..
సాక్షి, వికారాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇక ఓటర్లు తీర్పు చెప్పడమే మిగిలి ఉంది ఉంది. పదిహేను రోజులుగా ప్రచారం చేసిన ఎంపీ అభ్యర్థులు తమ రాజకీయ భవిష్యత్తును ప్రజల చేతిలోపెట్టి మైకులు బంద్ చేశారు. జిల్లాలో మంగళవారం సాయంత్రం 5గంటలకు ఎన్నికల ప్రచారం ముగించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమను గెలిపించాలంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా సభలు, సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహించాయి. ఆయా పార్టీల అగ్రనేతలు తరలివచ్చి రాజకీయాన్ని వేడెక్కించారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేశారు. తమను గెలిపిస్తే చేసే పనులను ప్రజలకు వివరించారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తామని, అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తామని హామీలు గుప్పించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తదిరతులు వచ్చి తమ పార్టీ అభ్యర్థులకు ఓటేయాలని కోరారు. 15 రోజులుగా మోతమోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. చివరిరోజున అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. తాండూరులో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని గెలిపించాలంటూ కోరుతూ మహేందర్‌రెడ్డి పట్టణంలో ప్రచారం చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా తాండూరులో ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. వికారాబాద్ పట్టణంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారం చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బి.జనార్దన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పరిగిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు చివరిరోజు గ్రామాల్లో ప్రచారం చేశారు. వ్యూహాలకు పదును... లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎంపీ అభ్యర్థులు ఓటర్లపైనే భారం వేశారు. గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారోననే ఉత్కంఠ ప్రధాన పార్టీల్లో నెలకొంది. పోలింగ్‌కు కొద్ది గంటల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో ఎంపీ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలుపు వ్యూహాలకు మరింత పదునుపెడుతున్నారు. వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మద్దతు కూడగట్టేందుకు ఎంపీ అభ్యర్థులు రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బి.జనార్దన్‌రెడ్డి తెరవెనుక జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 6 లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీ ఓట్లు తమకు దక్కేలా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ప్రలోభాలు షురూ.. ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో ఆయా పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. గెలుపు కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.వికారాబాద్‌లోని రాజీవ్‌నగర్‌లో నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో రూ.కోటియాభై లక్షల నగదు పట్టుబడటం సంచలనం రేపింది. ఈ డబ్బు పోస్టల్‌శాఖకు చెందినగా తెలిసింది. వికారాబాద్ నుంచి తాండూరుకు తరలిస్తుండగా పోలీసులు తమ డబ్బును పట్టుకున్నట్లు ఆశాఖ అధికారులు తెలిపారు. -
నాణ్యత లోపిస్తే సహించేది లేదు
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ చేపడుతున్న రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేత తదితర పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని మునిసిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ అన్నారు. బుధవారం ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డితో కలిసి బేగంపేట్, సికింద్రాబాద్ సంగీత్ థియేటర్, కీస్ హై స్కూల్, చిలుకలగూడ, సీతాఫల్మండి, బౌద్దనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులను పరిశీలించారు. ఇటీవలి భారీ వర్షాలకు నగరంలో 1200 ప్రాంతాల్లో 1,78, 973 మీటర్ల విస్తీర్ణంలో రహదారులు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలికంగా, ప్రయాణానికి అనువుగా ఉండేలా ఇంజనీరింగ్ విభాగం గుంతల పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే పనుల నిర్వహణపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండట, పత్రికల్లో కథనాలు వస్తుండటంతో ఆయన తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్‌లో రోడ్ల మరమ్మతులకు ఉపయోగిస్తున్న మెటల్ బి.టి, ఎమల్షన్ లను తగు పాళ్లలో మిక్సింగ్ చేసే అంశాన్ని తనిఖీచేశారు. కార్మికులు హ్యాండ్ గ్లౌజెస్ లేకుండా పనిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల మరమ్మతులలో నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచడంతో పాటు ఈ పనులను పర్యవేక్షించని ఇంజనీర్లపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేశారు. మరమ్మతుల సందర్భంగా రోలర్లను, కంప్రెషర్లను విధిగా ఉపయోగించి రోలింగ్‌ను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ప్రధాన మార్గాల్లో పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నగరంలోని రోడ్లను శాశ్వత ప్రాతిపదికన నిర్మాణానికి టెండర్లను పిలిచి పనులను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలన్నారు. రోడ్ల మరమ్మతులకు గాను 200లకుపైగా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు గుంతలను పూడ్చివేయడం, అవసరమైన మార్గాల్లో రోడ్లను పుననిర్మించడం తదితర చర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి వివరిం చారు. రోడ్ల మరమ్మతులను దీర్ఘకాలిక, మద్యంతర, స్వల్పకాలికంగా త్రిముఖ వ్యూహంతో చేపడుతున్నట్టు కమిషనర్ తెలిపారు. టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ లోపు దెబ్బతిన్న రోడ్లను ప్రయాణానికి అనువుగా ఉండేలా పనులను చేపడుతున్నామని, ప్రతిరోజు దాదాపు 1000కి పైగా గుంతలను పూడ్చివేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో జోనల్ కమిషనర్ జె.శంకరయ్య, సీఈ సుభాష్‌సింగ్, ఎస్ఈ కిషన్ , డిప్యూటీ కమిషనర్ విజయరాజు పాల్గొన్నారు.