తనిఖీలు నిర్వహిస్తున్న స్పెషల్ సీఎస్ గోపాల్, కమిషనర్ జనార్ధన్ రెడ్డి
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ చేపడుతున్న రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేత తదితర పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని మునిసిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ అన్నారు. బుధవారం ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డితో కలిసి బేగంపేట్, సికింద్రాబాద్ సంగీత్ థియేటర్, కీస్ హై స్కూల్, చిలుకలగూడ, సీతాఫల్‌మండి, బౌద్దనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులను పరిశీలించారు.
ఇటీవలి భారీ వర్షాలకు నగరంలో 1200 ప్రాంతాల్లో 1,78, 973 మీటర్ల విస్తీర్ణంలో రహదారులు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలికంగా, ప్రయాణానికి అనువుగా ఉండేలా ఇంజనీరింగ్ విభాగం గుంతల పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే పనుల నిర్వహణపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండట, పత్రికల్లో కథనాలు వస్తుండటంతో ఆయన తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్‌లో రోడ్ల మరమ్మతులకు ఉపయోగిస్తున్న మెటల్ బి.టి, ఎమల్షన్ లను తగు పాళ్లలో మిక్సింగ్ చేసే అంశాన్ని తనిఖీచేశారు.
కార్మికులు హ్యాండ్ గ్లౌజెస్ లేకుండా పనిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల మరమ్మతులలో నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచడంతో పాటు ఈ పనులను పర్యవేక్షించని ఇంజనీర్లపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేశారు. మరమ్మతుల సందర్భంగా రోలర్లను, కంప్రెషర్లను విధిగా ఉపయోగించి రోలింగ్‌ను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ప్రధాన మార్గాల్లో పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
నగరంలోని రోడ్లను శాశ్వత ప్రాతిపదికన నిర్మాణానికి టెండర్లను పిలిచి పనులను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలన్నారు. రోడ్ల మరమ్మతులకు గాను 200లకుపైగా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు గుంతలను పూడ్చివేయడం, అవసరమైన మార్గాల్లో రోడ్లను పుననిర్మించడం తదితర చర్యలు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి వివరిం చారు.
రోడ్ల మరమ్మతులను దీర్ఘకాలిక, మద్యంతర, స్వల్పకాలికంగా త్రిముఖ వ్యూహంతో చేపడుతున్నట్టు కమిషనర్ తెలిపారు. టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ లోపు దెబ్బతిన్న రోడ్లను ప్రయాణానికి అనువుగా ఉండేలా పనులను చేపడుతున్నామని, ప్రతిరోజు దాదాపు 1000కి పైగా గుంతలను పూడ్చివేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో జోనల్ కమిషనర్ జె.శంకరయ్య, సీఈ సుభాష్‌సింగ్, ఎస్‌ఈ కిషన్ , డిప్యూటీ కమిషనర్ విజయరాజు పాల్గొన్నారు.