కాంట్రాక్టు అధ్యాపకులపై ‘కత్తి’
డేట్లైన్ హైదరాబాద్
ఒక్కో వర్సిటీ ఒక్కో పేరుతో పిలిచే కాంట్రాక్టు అధ్యాపకులకు సెలవులుండవు. విద్యా సంవత్సరాంతంలో బ్రేక్ ఇచ్చి మళ్లీ ఆరంభంలో విధుల్లోకి తీసుకుంటారు. వారి డిమాండ్లు న్యాయమైనవి. వాటిలో ప్రధానమైనవేవీ అసాధ్యమైనవి కావు. ఖాళీ అధ్యాపక పోస్టులను భర్తీ చేయక ముందే తమను రెగ్యులరైజ్ చేయాలని, తమ సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని, ప్రభుత్వం ఒక కమిటీని నియమించి పనిజేస్తున్న వారిని సర్వీసులోకి తీసుకునేలా నియమనిబంధనలను తయారుచేయాలని వారు కోరుతున్నారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నియమావళి ప్రకారం విశ్వ విద్యాలయాలు ప్రధానంగా మూడు రకాలు విధులను నిర్వర్తించాలి. అవి బోధన, పరిశోధన,విస్తరణా కార్యక్రమాలు. మన దేశంలో ఉన్న 759 విశ్వ విద్యాలయాలలో ఎక్కువ బోధనకే పరిమితమయ్యాయి. కొన్ని బోధనతో పాటు పరిశోధనను కూడా సమానంగానే చేబడుతున్నాయి. ఇక విస్తరణా కార్యక్రమాలను అతి తక్కువ విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్నాయి. విస్తరణా కార్యక్రమాలలో ముఖ్యమైనవి వయోజన విద్య, సామాజిక ప్రయోజన కార్యకమాలు. వీటికి ప్రేరణ 1978లో జనతా ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ వయోజన విద్యా కార్యక్రమం.
తదుపరి ప్రభుత్వాలు వయోజన విద్యను అనియత విద్యా కార్యక్రమాలలో భాగంగా కొనసాగించి, ఆ తర్వాత చరమగీతం పాడాయి. దీనికి కారణం నిధుల కొరత మాత్రమే కాదు, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం కూడా. పరిశోధనా రంగంలోనే కృషిచేసే ప్రత్యేక సంస్థలున్నప్పటికీ విశ్వవిద్యాయాలు కూడా అకడమిక్ రీసెర్చ్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా సాంప్రదాయక విశ్వవిద్యాలయాలు బోధన, పరిశోధనలను సమతూకంలో కొనసాగిస్తున్నాయి. ఈ విషయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో ఉంది. కొత్తగా ప్రారంభించిన విశ్వ విద్యాలయాలలో పరిశోధన అంతంత మాత్రపు స్థాయిలోనే ఉంది. తగినంత మంది అధ్యాపకులు, అర్హులైన పర్యవేక్షకులు లేకపోవడమే దీనికి కారణం.
కాంట్రాక్టు అధ్యాపకుల గుండెల్లో గుబులు
ప్రస్తుతం మన రాష్ర్టంలో 14 విశ్వవిద్యాలయాలున్నాయి. ఒక్కటంటే ఒక్క కేంద్రీయ విశ్వ విద్యాలయం కూడా లేదు. ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర విశ్వ విద్యాలయాల గురించి మాత్రమే చర్చిస్తుంది. రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాలు ఎదుర్కొంటున్న సమస్య అధ్యాపకుల కొరత. సుమారు ఒక దశాబ్దం నుంచి అధ్యాపల భర్తీ జరగలేదు. పర్మినెంట్ ఫ్యాకల్టీ (బోధనా సిబ్బంది) చాలా తక్కువగా ఉంది. చాలా విభాగాలలో అది సున్నా స్థాయికి వచ్చేసింది. సింగిల్ అధ్యాపక విభాగాలు లేకపోలేదు.
దీని వల్ల సామాజిక శాస్త్రాలు, భాషా, మానవీయ శాస్త్ర విభాగాలను కొన్ని యూనివర్సిటీలలో మూసివేసారు. చాలా విభాగాలు సింగిల్ టీచర్ స్కూల్స్‌లా మిగిలిపో యాయి. దీన్ని అధిగమించడానికి కాంట్రాక్టు అధ్యాపకుల వ్యవస్థను విశ్వ విద్యాలయాలు ప్రారంభించాయి. ఇదిప్పుడు కేంద్ర విశ్వ విద్యాలయాలకు కూడా పాకింది. విద్యార్థులు, తల్లిదండ్రుల విమర్శలను తట్టుకోలేక ఇంజనీరింగ్ కళాశాలలో మొక్కుబడిగా అధ్యాపకులను నియమిస్తున్నారు.
కాంట్రాక్టు అధ్యాపకులు రెండు దశాబ్దాలుగా బోధనకే పరిమితమై పని చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాలలో సుమారు 500 మంది కాంట్రాక్టు పద్ధతిపై పనిజేస్తున్న అధ్యాపకులున్నారు. ఏదో నాటికి పర్మినెంట్ అవుతామన్న ఆశతో వారు పనిజేస్తున్నారు. ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాలలో, 1,385 ఆచార్య పదవులను భర్తీ చేస్తామని ప్రకటించింది. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులకు గుండెల్లో రాయి పడినట్లైయింది. ఇప్పుడైనా వారికి అవకాశం ఉంటుందో లేదోనని భయాందోళనతో ఉన్నారు. విచిత్రమేమిటంటే ఈ కాంట్రాక్టు అధ్యాప కులలో కొందరు 62 ఏళ్లు నిండి పదవీ విరమణ చేయబోతున్నారు.
పుండు మీద కారం చల్లినట్లు భర్తీ చేయబోయే అధ్యాపకుల పోస్టులకు రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలుంటాయని కూడా ప్రభుత్వం ప్రకటించింది. రెండు దఫాలుగా జరిగే ఈ నియామకాలలో ఏఏ విశ్వవిద్యాలయాలలో ఏఏ పోస్టులను భర్తీ చేస్తారని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయం తెలిసిన తర్వాత కాంట్రాక్టు అధ్యాపకులు తమ దగ్గర చదువుకున్న విద్యార్థులతోనే తాము పోటీ పడవలసిన అగత్యం ఏర్పడిందని వాపోతున్నారు. ఇదిలా ఉండగా గోరుచుట్టుపై రోకటి పోటున్నట్లు ఆచార్యుల నియామకాలను ఏపీపీఎస్సీకి అప్పగించాలని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.
దీంతో తమ భవిష్యత్తు ఏమౌతుందోనన్న భయంతో కాంట్రాక్టు అధ్యాపకులు రొడ్డెక్కారు. రోస్టర్ విధానం ప్రకారం ప్రకటించిన అధ్యాపక పోస్టులలో ఏ పోస్టు ఏ కేటగిరికి వెళుతుందో తెలియదు. ఈ పరిస్థితిలో ఇంతవరకూ ఖాళీ పోస్టులకు ప్రత్యా మ్నాయంగా పనిజేస్తున్న కాంట్ట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి అయోమయంగా మారింది. ఇదిలా ఉంటే కాంట్రాక్టు అధ్యాపకులు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకొని పోటీలో నిలబడాల్సి వస్తుంది. ఇక్కడే సమస్య మరింత జఠిలమైంది.
అధ్యాపకులు లేకుండానే ఉన్నత ప్రమాణాలా?
విశ్వ విద్యాలయాలలో పోస్టులు భర్తీ కాకపోవడానికి అధికారులు చాలా కారణాలు చెబుతున్నారు. కొంత కాలం ప్రభుత్వ ఆర్థికశాఖ అనుమతియ్య లేదన్నారు. కారణం ఏదైనా ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడాన్ని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఒక సమయంలో ఆంధ్ర విశ్వ విద్యాలయంలో రోస్టర్ వేయడం పూర్తి అయ్యింది, రేపో మాపో ప్రకటన వస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఒకానొకప్పుడు ఆంధ్ర యూనివర్సిటిలో 1,200 అధ్యాపకులుండేవారు. వారి సంఖ్య ప్రస్తుతం 350కి పడిపోయింది. ఖాళీయైన స్థానాల్లో కాంట్రాక్టు అధ్యాపకులు, గెస్ట్ ఫ్యాకల్టీలు పనిజేస్తున్నారు.
ఈ తాత్కాలిక అధ్యాపకుల తోనే యూనివర్సిటీలు పని చక్కబెడుతున్నాయి. అధ్యాపకుల కొరత ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయాలకు ప్రపంచ ర్యాంకులు రావాలని, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు పోటీగా నాణ్యమైన విద్యను అందించాలని ప్రయత్ని స్తున్నాయి. పూర్తి స్థాయి అధ్యాపకులు లేనిదే అది సాధ్యం కాదు. ఈ విష యం వారికి తెలియనిది కాదు. దేనికైనా అధ్యాపకులే నాంది. విద్యనందిం చడంలో అధ్యాపకులదే ప్రధాన పాత్ర. ఏ విద్యాసంస్థయైనా కీర్తి పొందిం దంటే అది అధ్యాపకులవల్లనే. సంస్థలు దానిని నిలబెట్టుకోవాలి.
ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యారంగంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో పాటు, ప్రైవేటు, విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నత విద్యనందించడానికి ముందుకు వస్తున్నాయి. వీటికి పోటీగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. విద్యాప్రణాళికలో సెమిస్టర్ విధానంతోబాటు ఐచ్ఛికాధార జమా వ్యవస్థ (Choice Based Credit System) అంతర్ నాణ్యతా హామీ వ్యవస్థ (IQAC) ఉద్యోగ నియామకాల వ్యవస్థ (Placement Cell) లాంటివి ప్రవేశపెట్టాయి. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే సుశిక్షితులైన అధ్యాపకులు కావాలి. అందు లోనూ సుదీర్ఘ అనుభవమున్న వారుండాలి. యూజీసీ ప్రమాణాల ప్రకారం ప్రతి శాఖలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి.
ఇప్పుడు చాలా విశ్వవిద్యాలయాలలో ఫీడర్ పోస్టులైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకపోవడం వల్ల అసోసియేట్ ప్రొఫెసర్ల స్థాయి లేకుండా పోయింది. ఈ ప్రాథమిక స్థాయిలో పనిజేస్తున్నవారు కాంట్రాక్టు అధ్యాపకులు. వీరు రెగ్యులరైజ్ అయ్యే పరిస్థితి సుదూరంలో కనబడటం లేదు. ఈ కాంట్రాక్టు అధ్యాపకులను ఒక్కో యూనివర్సిటీ ఒక్కో పేరుతో పిలుస్తాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్టు), ఎకడమిక్ కన్సల్టెంట్, అడ్హాక్ ఫ్యాకల్టీ, టీచింగ్ అరేంజ్మెంట్ ఇలా రకరకాల పేర్లతో వీరు పనిచేస్తున్నారు. వీరికి సెలవులుండవు. బోధనకు తప్ప మరే పనికీ పనికి రారు. ప్రతి సంవత్సరాంతంలో బ్రేక్ ఇచ్చి విద్యా సంవత్సర ఆరంభంలో మళ్లీ విధుల్లోకి తీసుకుంటారు. ఈ రకంగా కాంట్రాక్టు అధ్యాపకులు దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షుగా బతుకు వెళ్లదీస్తున్నారు.
డిమాండ్లు న్యాయమైనవి, సాధ్యమైనవి
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలోని కాంట్రాక్టు అధ్యాపకులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆందోళన బాటపట్టారు. ఇటీవల అమరావతి దగ్గర ధర్నా చేసిన కొంత మంది కాంట్రాక్టు అధ్యాపకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. వీరు పెడుతున్న డిమాండ్లలో న్యాయం ఉంది. వాటిలో ప్రధాన డిమాండ్లు అసాధ్యమైనవి కావు. ఖాళీ అధ్యాపక పోస్టులను భర్తీ చేయక ముందే వారిని రెగ్యులరైజ్ చేయాలని, తమ సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని, రాష్ట్రప్రభుత్వం ఒక కమిటీని నియమించి ఇంతవరకు పనిజేస్తున్న వారిని సర్వీసులోకి తీసుకునే విధంగా నియమనిబంధనలను తయారుచేయాలని, కాంట్రాక్టు అనే పద్ధతిని రద్దు చేయాలని కోరుతున్నారు.
కాంట్రాక్టు అధ్యాపకుల డిమాండ్ల ఆధారంగా, వారు కోరుతున్నట్టు చట్టబద్ధంగా నియమించిన కమిటీ ద్వారా తమ పోస్టులు భర్తీ చేశారని, అప్పటికే ఖాళీగా ఉన్న స్థానాలలో తమను నియమించారని, కాబట్టి తాము మరో పరీక్షకు గాని, ఇంటర్వ్యూకుగానీ హాజరవ్వాల్సిన అవసరం లేదని వారు వాదిస్తున్నారు. అంతేకాదు ఈ కాంట్రాక్టు విధానంలో పనిజేస్తున్న వారిలో నూటికి 80 శాతం దళిత, ఆదివాసీ, వెనుకబడిన తరగతులు, మైనార్టీ వర్గానికి చెందినవారు. సెప్టెంబరు 5న జరిగిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక సెంట్రల్ యూనివర్సిటీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిజే స్తున్న ఒక అధ్యాపకురాలు రాష్ట్రపతికి ఒక బహిరంగ లేఖను రాశారు. మమ్మల్ని ఉపాధ్యాయులుగా కాకుండా కేవలం ‘సంఖ్యా’ నామవాచకంతో పిలుస్తున్నారని, అదైనా జూన్-ఏప్రిల్ నెలల మధ్య పనిజేసే కూలీలుగా చూస్తున్నారని ఆమె ఆ లేఖలో వాపోయారు.
అత్యున్నత విద్యనభ్యసించిన మాలాంటి వారిని ‘అడ్హాక్స్’గా పిలుస్తూ నానా రకాల అవమానాలకు గురి చేస్తున్నారని, కనీసం అధ్యాపకులుగా కాకపోయినా మనుషులుగా గుర్తిం చాలని ఆమె రాష్ట్రపతిని వేడుకొంది. పేరు కూడా తెలియకుండా ఆమె ఈ లేఖ రాసిందంటేనే కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి ఆమె మాటల్లో ‘అడ్హాక్స్’ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమౌతుంది. ఇప్పటికైన రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు కాంట్రాక్టు అధ్యాపకులపై దృష్టి పెట్టి తగు న్యాయం చేయడం శ్రేయస్కరం.
వ్యాసకర్త ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు
మొబైల్: 9963366788
- ప్రొఫెసర్
కె.పి. సుబ్బారావు