విద్యార్థులు శాస్త్రీయంగా ఆలోచించాలి
పాలకోడేరు: విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలతో అధ్యయనం చేయాలని జనవిజ్ఞాన వేదిక విద్యాభాగం జిల్లా కన్వీనర్ చింతపల్లి ప్రసాదరావు అన్నారు. మోగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వేసవి అధ్యయన శిబిరం శనివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న చింతపల్లి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ అవగాహన పెంచుకోవడం ద్వారా మూఢ నమ్మకాలను పారద్రోలవచ్చన్నారు. సమాజంలో పెరుగుతున్న అశాస్త్రీయ భావజాలం, మూఢ నమ్మకాలపై ఎస్ఎఫ్ఐ విద్యార్థులను చైతన్య పరచాలని కోరారు. రాజ్యం నుంచి మతాన్ని వేరుగా చూడడమే లౌకికవాదమని, నేటి పాలకులు లౌకిక స్ఫూర్తికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. యూటీఎఫ్ జిల్లా నాయకులు పెన్మెత్స శ్రీనివాసరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కాగితపు అనిల్ పాల్గొన్నారు.