బాబూ... చిట్టీ!
కమెడియన్ అంటే మగవాడేనా? ఆడవాళ్లు నవ్వించలేరా? శ్రీలక్ష్మిని చూసి కూడా ఆ మాట అనగలమా!
ఒక్క శ్రీలక్ష్మి... వంద కమెడియన్ల పెట్టు.
జంధ్యాల ప్రసాదించిన కామెడీ వరాల్లో శ్రీలక్ష్మి మేలైన వరం.
కాదు కాదు... ఫిమేలైన వరం.
శ్రీలక్ష్మి చేసిన అయస్కాంతాల్లాంటి అనేక పాత్రల్లో ‘జయమ్ము నిశ్చయమ్మురా’లోని ఈ కాంతం పాత్ర ప్రత్యేకమైనది!
రాంబాబు, సూరిబాబు... ఇద్దరూ జంట కవుల్లాంటి వాళ్లు. ఒకే మంచంలో తిని, ఒకే కంచంలో పడుకునేంత... సారీ సారీ... ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకునేంత ఫ్రెండ్సాతి ఫ్రెండ్సు. రాంబాబుకు తలపోటు వస్తే, సూరిబాబు శారిడాన్ వేసుకునేంత క్లోజన్నమాట. వీళ్లిద్దరూ ఓ ఇంట్లో అద్దెకుంటుంటారు. అప్పటివరకూ హుషారుగా రోడ్లన్నీ బలాదూర్‌గా తిరిగేసిన ఈ జంట... ఇంటి సమీపానికి రాగానే మాత్రం టెన్షనైపోతారు. అటెన్షనైపోతారు. ధైర్యం కోసం ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని, పిల్లుల్లా నడుస్తూ ఇంట్లోకి అడుగుపెడుతుంటారు.
ఎందుకంత భయం?
ఆ ఇంట్లో అల్సేషియన్ కుక్క ఉందా?... లేదు.
రెంట్ బాకీ ఉందా? అస్సల్లేదు.
కుక్క ఉంటే కరిపించుకుని బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్స్ అయినా చేయించుకోవచ్చు. రెంట్ కట్టాలనుకుంటే నానాగడ్డీ కరిచి, వాళ్ల గడ్డం... వీళ్ల గడ్డం పుచ్చుకుని అప్పు తీసుకోవచ్చు.
మరేంటి ప్రాబ్లమ్? ఓకే... మీకంత ఆరాటంగా ఉంటే... పదండి ముందుకు... పదండి తోసుకు... పోదాం పోదాం. గోపాలం అండ్ కాంతం ఇంటికి.
తలుపు చప్పుడైతే కాంతం వెళ్లి తీసింది. రాంబాబు, సూరిబాబు లోపలకొచ్చి, చాలా బుద్ధిగా పైన రూమ్కెళ్లడానికి మెట్లు ఎక్కబోతున్నారు. వాళ్లు ఊహించిన ప్రమాదం ఎదురవ్వనే అయ్యింది. ‘‘అవునూ... ఎందుకింత లేటయ్యింది?’’ అడిగింది కాంతం. ‘చచ్చాంరా దేవుడోయ్’ అనుకున్నారిద్దరూ. రాంబాబు నీళ్లు నములుతూ ‘‘ఊళ్లోకి ‘శనిదేవుని లీలలు’ అనే భక్తి సినిమా వచ్చింది అక్కయ్యగారూ’’ అని చెప్పాడు. కాంతం ఫేసులో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ‘‘ఏంటి... మిమ్మల్నే... భక్తి సినిమాకెళ్లొస్తున్నారా?’’ అనడిగింది. ఇద్దరూ బుర్రలూపారు.
అంతే... కాంతం కళ్లల్లో మున్సిపాల్టీ ట్యాప్ ఓపెనైపోయింది. ఇక్కడ రాంబాబు గుండెను ఎవరో డోలు వాయిస్తున్న ఫీలింగ్. సూరిబాబుకేమో తనే సన్నాయిలా అయిపోయినట్టు డ్రీమ్. పి... పి....పీ... పీ... డుం... డుం...
వచ్చేసింది సునామీ. ‘బాబూ... చిట్టీ’ అంటూ కాంతం గభాల్న రాంబాబును గట్టిగా కౌగిలించుకుంది. బోనులో పడ్డ ఎలకలాగా రాంబాబు తెగ కంగారుపడిపోయాడు. కాంతమ్మక్కయ్య కౌగిలిని విడిపించుకోవడానికి నానా తిప్పలు పడుతూ ‘‘ఏవండీ... పొరపాటైపోయిందండీ’’ అని వాపోయాడతను. అయినా కాంతం వదిలితేగా!
‘‘మా చిట్టికి కూడా ఇలాగే భక్తి సినిమాలంటే ప్రాణం బాబూ’’ అని తెగ కన్నీరు మున్నీరైపోయింది. చివరకు ఎప్పటికో వదిలిందామె. పులి నోట్లో చిక్కుకుని తప్పించుకున్న కుందేలు పిల్లలాగా బెదిరిపోయాడు.
ఇప్పుడర్థమైందిగా... రాంబాబు, సూరిబాబులు ఎందుకంత భయపడుతున్నారో!
ఈ కాంతానికి ఓ విషాదకరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంది.
చెబితే మీరు కూడా కరిగిపోయి ‘బాబూ! చిట్టీ’ అంటూ ఎవరో ఒకరిని వాటేసుకోవడం ఖాయం!
వీళ్లకు ఒక్కగానొక్క సంతానం. పేరు చిట్టి. 21 ఏళ్లు నిండకుండానే నూరేళ్లూ నిండిపోయాయి పాపం. ఆ చిట్టిని మర్చిపోవడం ఆమె వల్ల కావడం లేదు. చిట్టి జ్ఞాపకాలు ఈ చిట్టి తల్లిని టీవీ సీరియల్లాగా వెంటాడుతూనే ఉన్నాయి. ఎవరన్నా ఏదన్నా ‘మాట’ అంటే చాలు... ‘మా చిట్టి కూడా సేమ్ టూ సేమ్ ఇలానే...’ అంటూ వాళ్లను వాటేసుకుని మరీ భోరున విలపించడం ఆమెకు కామనైపోయింది.
ఈ ‘చిట్టి’తల్లి బాధితుల్లో చాలామంది ఉన్నారు. పాలవాడు... కూరలవాడు... పోస్ట్‌మేన్... మన రాంబాబు, సూరిబాబు... ఇలా కోకొల్లలు. అయితే అందరికీ ఆమె తల్లిప్రేమ తెలుసు కాబట్టి, ఎవరూ అపార్థం చేసుకోరు.
రాంబాబు బాగా పడ్డాడు. బురదలో కాదండోయ్... ప్రేమలో. అమ్మాయిది సూరిబాబు వాళ్ల ఊరే. ఆ ప్రేమ ప్రయత్నంలో భాగంగా ఆ ఊళ్లోనే తిష్ఠ వేశాడు మన రాంబాబు. గుళ్లూ గోపురాలు తిరుగుతూ పుణ్యదంపతులైన గోపాలం-కాంతం కూడా ఈ ఊరొచ్చారు. లటుక్కున దొరికేశాడు రాంబాబు. సరే.. అని ఓ ప్లాన్ వేశాడు. తన అమ్మానాన్నల్లా నటించమని అడిగాడు. వాళ్లు ఓకే...
సూరిబాబు నాన్నది ఓ చిత్రమైన కేరెక్టర్. పేరు పటేల్. నైజాం నుంచి ఇక్కడికి ఇల్లరికం వచ్చాడు. మహా సినిమా పిచ్చి, డబ్బు పిచ్చి. ఇంటికొచ్చి ఎవరు కాఫీ తాగినా, టిఫినీ తిన్నా చేతిలో బిల్లు పెట్టేస్తాడు.
గోపాలానికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఆయన ఎంచక్కా కాఫీ జుర్రుకుంటూ తాగేసరికి, ఈ పటేల్ వచ్చి చేతిలో బిల్లు పెట్టాడు. గోపాలం షాక్.
‘‘నేను పైసలు కాడ బరాబర్ ఉంటా’’ చెప్పాడు పటేల్.
అంతే... ఈ మాటలు విని లోపల్నుంచీ పరిగెత్తు కుంటూ వచ్చింది కాంతం. ‘‘ఏమన్నారు... పైసలు దగ్గర కచ్చితంగా ఉంటాననా?’’ అనడిగింది. పటేల్ అయోమ యంగా ‘‘అవును’’ అన్నాడు. అంతే... డోలు- సన్నాయి ఒక్కసారిగా పి... పి... పీ... పీ... డుం... డుం... అంటూ మోగాయి. ‘‘బాబూ... చిట్టీ’’ అంటూ కాంతం, పటేల్‌ను కౌగిలించుకోవడానికి సిద్ధపడింది. గోపాలం అడ్డుపడ్డాడు. ‘‘కాంతం ఆగిపో... ఆవేశపడకు... కావలించుకుంటే చొక్కా నలిగిపోయిందని బిల్లు చేతిలో పెడతాడు’’ అన్నాడు గోపాలం. దాంతో కాంతం తన ఆప్యాయతానురాగాభి మానాల ప్రేమ సముద్రాన్ని తనలోనే దాచేసుకుంది.
ఈ పటేల్ చెప్పే సైన్మా కథలకు గోపాలం బుర్ర వాచి పోతోంది. ఎంత తప్పించుకుందామన్నా వదిలి చావడే. చివరకు ఈ ‘బాబూ చిట్టీ’ నామస్మరణే గోపాలానికి పటేల్ పీడ వదిలేలా చేసింది. అదెలా అంటే...
పటేల్ ‘పాండవ వనవాసం’ సైన్మా కథ చెబుతున్నాడు. ‘‘ఎస్వీవోడు తొడగొడుతున్నాడు... సావిత్రమ్మ ఏడుస్తోంది... భీముడు గద పట్టుకుని పిసుకుతా ఉన్నాడు...’’ ఇలా పటేల్ ఊకదంపుడుగా చెబుతూనే ఉన్నాడు. గోపాలంలో ఆగ్రహం బ్యారికేడ్లు దాటేసింది.
దాంతో తానే రివర్స్‌లో కథ చెప్పడం మొదలుపెట్టాడు గోపాలం. ఎన్టీవోడంటాడు... గవాస్కరంటాడు... హేమమాలిని మనవరాలంటాడు... మహ్మద్ బీన్ తుగ్లక్ అంటాడు... ఇక చూడాలి పటేల్ తిప్పలు. బెంబేలెత్తిపోయాడు.
‘‘తమ్మీ... ఇంక నన్ను వొదిలేయరాదే... ఒడ్డున పడ్డ చేప తీరునయిపోయింది నా బతుకు’’ అని వాపోయాడు పటేల్. అప్పుడే ఎంటరైంది కాంతం.
‘‘ఏమన్నావ్ బాబూ... ఒడ్డున పడ్డ చేపా?’’ అనడిగింది.
పటేల్ బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డాడు. ‘‘బాబూ... చిట్టీ’’ అని కాంతం వాటేసుకోవడానికి సిద్ధమైంది. పటేల్ బిక్కచచ్చిపోయాడు. దెబ్బకు పరుగో... పరుగు...
అదండీ... ఈ ‘చిట్టి’ కథ. ఇక కథ కంచికి... మీరు ఇంటికి. ఎక్స్‌క్యూజ్‌మీ... మీరుండేది సొంతిల్లా? అద్దె ఇల్లా? అద్దె ఇల్లు అయితే కాంతంగారు లేరు కదా..!
హహ్హహ్హహ్హహ్హ...
- పులగం చిన్నారాయణ
ఇన్స్పిరేషన్ ఎవరో ఉండే ఉంటారు!
‘‘ఈ పాత్ర అనే కాదు... జంధ్యాల గారు సృష్టించిన ఏ పాత్ర అయినా చిరంజీవుల్లా కలకాలం నిలిచి పోయేవే. 26 ఏళ్ల క్రితం చేసిన ఈ పాత్ర ఇప్పటికీ ఏదో ఒక రూపంలో మార్మోగిపోతూనే ఉంది. ఈ క్రెడిట్ ఓ రకంగా ‘సాక్షి’ టీవీకి దక్కుతుంది. వాళ్లు ఈ ‘బాబూ! చిట్టీ’ని సెటైరిక్‌గా బాగా వాడుకోవడంతో, అన్ని గేమ్ షోల్లోనూ, న్యూస్ చానల్స్‌లోనూ దీన్ని విరివిగా వాడుతున్నారు. జంధ్యాలగారు చుట్టూ ఉన్న సమాజం నుంచి, మనుషుల నుంచి ప్రేరణ పొంది పాత్రలు సృష్టిస్తుంటారు. ఈ పాత్రక్కూడా కచ్చితంగా ఏదో ఒక ప్రేరణ ఉండే ఉంటుంది. నాకైతే తెలీదు.’’
- శ్రీలక్ష్మి
ఆ నాదస్వరం బిట్ తప్ప మరేదీ అక్కడ అతకదు!
‘‘జంధ్యాల గారి దర్శకత్వంలో తొలిసారిగా మేము సంగీతం అందించిన చిత్రం ‘జయమ్ము... నిశ్చయమ్మురా!’. శ్రీలక్ష్మి ‘బాబూ చిట్టీ’ అనే డైలాగ్ చెప్పినచోటల్లా ప్రత్యేకమైన రీరికార్డింగ్ మ్యూజిక్ బిట్ పెట్టాలనుకున్నాం. కె.వి. మహదేవన్ సంగీతంలో వచ్చిన పాత తమిళ సూపర్‌హిట్ ‘తిల్లానా మోహనాంబాళ్’లో శివాజీగణేశన్ నాదస్వర విద్వాంసుడు. పద్మిని నర్తకి.
అందులో పద్మిని, శివాజీ జంట మీద వచ్చే ‘నలందానా....’ (బాగున్నావా అని అర్థం) అనే పాట పెద్ద హిట్. పాటలో హీరోయిన్ పలికే ఆ మాటకు, ‘పి...పి.. పీ..పీ...’ అంటూ నాదస్వరంలో బదులిస్తాడు హీరో. సరిగ్గా ఆ పాపులర్ నాదస్వరం బిట్‌నే ఈ ‘బాబూ చిట్టీ’కి వాడితే కామెడీ బాగా పండుతుందని అనిపించింది. అది తప్ప మరేదీ అక్కడ అతకదని అనిపించింది. అలా చేసిన ప్రయోగం ఇవాళ్టికీ అందరూ చెప్పుకొనే పెద్ద హిట్ కామెడీ సీన్ అయింది.’’
- రాజ్ - కోటి జంటలో ఒకరైన ప్రముఖ సంగీత దర్శకుడు కోటి
హిట్ క్యారెక్టర్
సినిమా పేరు: జయమ్ము నిశ్చయమ్మురా (1989)
డెరైక్ట్ చేసింది: జంధ్యాల; సినిమా తీసింది: జీవీహెచ్ ప్రసాద్
మాటలు రాసింది: జంధ్యాల