మార్కెట్లు అక్కడక్కడే...
మార్కెట్ అప్డేట్
- సెన్సెక్స్ 20 పాయింట్లు ప్లస్
- రోజంతా స్వల్ప ఒడిదుడుకులు
సెంటిమెంట్‌ను ప్రభావితం చేయగల అంశాలేవీ లేకపోవడంతో మార్కెట్లు స్వల్ప స్థాయి కదలికలకే పరిమితమయ్యాయి. రోజంతా చిన్నగా ఒడిదుడుకులకు లోనైనప్పటికీ చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు లాభపడి 22,344 వద్ద నిలవగా, నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 6,660 వద్ద స్థిరపడింది. వినియోగ వస్తువులు, బ్యాంకింగ్, ఆటో రంగాలు 1-0.5% మధ్య బలపడగా, ఎఫ్ఎంసీజీ, రియల్టీ 1% స్థాయిలో నీరసించాయి.
అమెరికా ఆర్థిక వ్యవస్థకు మద్దతును కొనసాగిస్తామంటూ ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ యెలెన్ ప్రకటించడంతో అంతర్జాతీయ స్థాయిలో సెంటిమెంట్ మెరుగుపడిందని నిపుణులు విశ్లేషించారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ముందురోజు రూ. 119 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 363 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 120 కోట్ల అమ్మకాలు నిర్వహించాయి.
ఐపీవో బాటలో రత్నాకర్ బ్యాంక్
న్యూఢిల్లీ: ఆర్బీఎల్ బ్యాంక్ (గతంలో రత్నాకర్ బ్యాంక్) పబ్లిక్ ఇష్యూ చేపట్టే ప్రణాళికల్లో ఉంది. తద్వారా కనీసం రూ. 500 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో ఐపీవోను చేపట్టే యోచనలో ఉన్నట్లు బ్యాంక్ ఎండీ విశ్వవీర్ అహుజా పేర్కొన్నారు. రానున్న రెండు మూడు నెలల్లో ఇందుకు అవసరమైన సన్నాహాలను చేపడతామని చెప్పారు. ఆఫర్ ఏ స్థాయిలో చేపట్టేదీ ఇంకా నిర్ణయించనప్పటికీ కనీసం 10% వాటా విక్రయం ద్వారా రూ. 500 కోట్లను సమీకరించాలిని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 5 లక్షల కస్టమర్లకు బ్యాంక్ సేవలను అందిస్తున్నదని, రూ. 21,000 కోట్లకుపైగా బిజినెస్‌ను కలిగి ఉన్నదని వివరించారు.