ప్రణబ్ కుమారుడికి ఎదురుగాలి!
జంగీపూర్: పశ్చిమ బెంగాల్ లోని జంగీపూర్ లోకసభ నియోజకవర్గంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీకి ఎదురుగాలి వీస్తోంది. 'బీడి' టౌన్ పేరున్న ఈ నియోజకవర్గంలో ముస్తిం కమ్యూనిటికి చెందిన ఆరుగురు ప్రత్యర్ధులు అభిజిత్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. దాంతో ఏప్రిల్ 24 తేదిన జరిగే ఎన్నికలో బహుముఖ పోటి నెలకొంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వామపక్ష అభ్యర్థి ముజఫర్ హోస్సేన్, తృణమూల్ అభ్యర్థి హజీ నురుల్ ఇస్తాం, బీజేపీ సమ్రాట్ ఘోష్ ల నుంచి గట్టిపోటి ఎదురవుతోంది.
2012లో ప్రణబ్ ముఖర్జీ జంగీపూర్ నియోజకవర్గానికి రాజీనామా సమర్పించిన తర్వాత లెఫ్ట్ పార్టీ అభ్యర్థి హోస్సేన్ చేతిలో 2536 ఓట్ల స్వల్ప తేడాతో అభిజిత్ గెలిచారు. ఎన్నికల బరిలో ముగ్గురున్నా.. నలుగురున్నా గెలుపు తనదేనని అభిజిత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ప్రణబ్ ఇదే స్థానం నుంచి లక్ష 28 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.