హామీలు నెరవేర్చకపోతే మహానాడును అడ్డుకుంటాం
ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జన్ని రమణయ్య
చిత్తూరు : మాదిగలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను నెరవేర్చకుంటే మహనాడును అడ్డుకుంటామని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జన్ని రమణయ్య మాదిగ హెచ్చరించారు. మంగళవారం ఆయన చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై మాదిగల్లో వ్యతిరేకత ఏర్పడుతోందన్నారు.
ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మరచిపోయారని ఆరోపించారు. 33 లక్షల మంది మాదిగల ఓట్లతో గద్దెనెక్కి ఇప్పుడు వారికే తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీ రామారావు ప్రవేశ పెట్టిన శాశ్వత మేనిఫెస్టోలో మాదిగలకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి అప్పట్లో మాదిగ వర్గానికి చెందిన వ్యక్తిని ఆర్థిక మంత్రిగా చేశారని గుర్తు చేశారు.
ఇప్పుడు అదే మాటలతో మాదిగలను నమ్మించి అధికారం చేపట్టి కనీసం అర్హులకు పింఛన్లు కూడా పంపిణీ చేయలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్ అందజేయాలని చంద్రబాబును రమణయ్య మాదిగ డిమాండ్ చేశారు.
తమ సమస్యలపై వెంటనే స్పందించకపోతే జూన్ 27వ తేదీన మహనాడులో వినతిపత్రం అందజేసి, 28న రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ విగ్రహాల వద్ద నిరసన చేపడతామని... అలాగే 29న మహానాడు ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు అనీల్ తదితరులు పాల్గొన్నారు.