ఉడీ ఉగ్రదాడులను ఖండించిన జపాన్
తమ దేశం కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని జపాన్ రాయబారి కెంజి హిరమట్సు అన్నారు. 19 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఉడీ ఉగ్రదాడిని తమ దేశం ఖండిస్తోందని ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడాలంటే సమాచార మార్పిడి, నిఘా విషయాలు పంచుకోవడం చాలా ముఖ్యమన్నారు. ''ఉడీలో భారత సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం'' అని హిరమట్సు చెప్పారు.
జపాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గత జూలై నెలలో జరిగిన ఢాకా ఉగ్రదాడిలో ఒక భారతీయ యువతితో పాటు ఏడుగురు జపనీయులు కూడా మరణించారని ఆయన గుర్తుచేశారు. ఢాకాలోని హోలీ ఆర్టిసాన్ బేకరీలో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే, ఉగ్రవాదంపై పోరాటంలో జపాన్, భారతదేశం కలిసి మెలిసి ఉండాలని.. నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని హిరమట్సు తెలిపారు.