మెదక్‌లో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్
- పెట్టుబడిదారులను ఆకట్టుకునేందుకు ఏర్పాటు
- డిప్ కార్యదర్శితో భేటీలో సీఎస్ రాజీవ్‌శర్మ వెల్లడి
- నిమ్జ్, ఫార్మాసిటీకి సాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం
- డీపీఆర్ తయారు చేయాలని డిప్ అధికారుల సూచన
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడిదారుల నడుమ పోటీతత్వం పెంచడంతో పాటు ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి మరింత మంది పెట్టుబడిదారులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లాలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వెల్లడించారు. కేంద్ర పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహకాల విభాగం(డిప్) కార్యదర్శి రమేశ్‌అభిషేక్, సంయుక్త కార్యదర్శి శైలేంద్రసింగ్‌తో బుధవారం సచివాలయంలో రాజీవ్‌శర్మ సమావేశమయ్యారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్రం తరఫున డిప్‌కు పలు ప్రతిపాదనలు సమర్పించారు.
జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి(నిమ్జ్)తో పాటు ఫార్మా సిటీ మాస్టర్‌ప్లాన్, మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్రం సాయం చేయాలని సీఎస్ కోరారు. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణానికి మరింత ఊతమిచ్చేందుకు మెదక్ జిల్లాలో నిమ్జ్, హైదరాబాద్ ఫార్మా సిటీ, వరంగల్‌లో టెక్స్టైల్ పార్కు, డ్రైపోర్టులు, పారిశ్రామిక కారిడార్లు తదితరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాజీవ్‌శర్మ వెల్లడించారు. సమీకృత మెషీన్ టూల్ పార్కు, పరిశోధన, అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి కేంద్రం, టెక్స్టైల్ మెషినరీ తయారీకి అవసరమైన ఇంజనీరింగ్ సౌకర్యాలు తదితరాలను నిమ్జ్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా నిమ్జ్‌లో మరిన్ని పెట్టుబడులు రాబట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఫార్మా సిటీలో ఫార్మా యూనివర్సిటీతో పాటు నైపుణ్య శిక్షణ కేంద్రం, ఇంక్యుబేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ వెల్లడించారు.
రాష్ట్రంలో సులభ వాణిజ్యం దిశగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్‌రాజ్ వివరించారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసే వారు గతంలో 114 రకాలైన అనుమతులు తీసుకోవాల్సి ఉండగా.. ప్రస్తుతం 12 రకాలైన అనుమతులకు పరిమితం చేస్తూ జీవో 84 జారీ చేశామన్నారు. వరంగల్ సమీకృత టెక్స్టైల్ పార్కు, డ్రై పోర్టులు, హైదరాబాద్-వరంగల్ ఆర్థిక కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధం చేయాల్సిందిగా పరిశ్రమల శాఖ అధికారులకు డిప్ కార్యదర్శి రమేశ్‌అభిషేక్ సూచించారు. దేశంలో ఏర్పాటయ్యే పారిశ్రామిక అభివృద్ధి కారిడార్లలో తెలంగాణను భాగస్వామిగా చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు.