పీవీ మాడ్యూల్స్ పరిశ్రమలు నెలకొల్పండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటు చేసే సౌర విద్యుత్ ప్లాంట్లకు ఫోటో వోల్టాయిక్ (పీవీ) మాడ్యూల్స్ పెద్దసంఖ్యలో కావాల్సి ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఫ్యూచర్ సిటీలో ఫ్యూయ ల్ సెల్ టెక్నాలజీని వినియోగించబోతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పీవీ మాడ్యూ ల్స్, ఫ్యూయల్ సెల్స్ తయారీ యూనిట్ల ఏర్పా టుకు ముందుకు రావాలని ప్రముఖ జపనీస్ కంపెనీ తోషిబాను ఆహ్వానించారు. జపాన్ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన టోక్యో శివార్లలోని తోషిబా ప్రధాన కార్యాలయంలో ఫ్యూయల్ సెల్, న్యూక్లియర్ పవర్/థర్మల్ పవర్ టర్బైన్లు, జనరేటర్ల తయారీ యూనిట్లను పరిశీలించారు. కంపెనీ ఉన్నతాధికారి హిరోషి కనేట, వైస్ ప్రెసిడెంట్ షిగేరిజో కవహర.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ ఉత్పత్తులను వివరించారు. తెలంగాణను ఎల్రక్టానిక్ హబ్‌గా మార్చనున్నామని, ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్దపీట వేస్తామని భట్టి విక్రమార్క వారికి చెప్పారు. సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణలో భాగంగా లిథి యం, ఇతర ఖనిజ తవ్వకాల రంగంలోకి ప్రవేశించనుందన్నారు. లిథియం బ్యాటరీల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తోషిబా సింగరేణితో కలిసి ముందు కు పోవచ్చని సూచించారు. భారత్‌లో మూడు రాష్ట్రాల్లో తమ యూనిట్లను నెలకొల్పామని, అందులో తెలంగాణలోని యూనిట్ అత్యంత ముఖ్యమైనదని తోషిబా ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వ ఉమ్మడి భాగస్వామ్యంతో తమ పరిశ్రమలను విస్తరించేందుకు సానుకూలంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో బులెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలి భట్టి విక్రమార్క బుల్లెట్ ట్రైన్లో 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒసాకా పట్టణాన్ని 2.2 గంటల్లో చేరుకున్నారు. ఈ తరహా రవాణా వ్యవస్థను తెలంగాణలోనూ అభివృద్ధి చేయాలని రైల్వేశాఖను కోరనున్నట్లు ఆయన తెలిపారు. అక్కడి పానసోనిక్ ప్రధాన కార్యాలయాన్ని భట్టి సందర్శించనున్నారు. పర్యటనలో ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు.