'జపాన్ గ్రాండ్ ప్రిలో రాణిస్తా'
సుజుకా: ఈ వారాంతంలో ఆరంభం కానున్న జపాన్ గ్రాండ్ ప్రి ఫార్ములావన్ లో మరింత రాణిస్తానని అంటున్నాడు భారత్కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్ సెర్గియో పెరెజ్. ఇటీవల జరిగిన సింగపూర్ గ్రాండ్ ప్రిలో ఏడో స్థానం సాధించి ఆకట్టుకున్న పెరెజ్.. తదుపరి గ్రాండ్ ప్రికి సిద్ధమవుతున్నట్లు తెలిపాడు.సింగపూర్ గ్రాండ్ ప్రిలో మొత్తంగా మూడు పాయింట్లు సాధించిందుకు తనకు ఆనందంగా ఉందన్నాడు. అయితే జపాన్ గ్రాండ్ ప్రిలో మరింత రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
వరుసగా జరిగిన మూడు ఫార్ములావన్ రేసుల్లో తాను ఎంతో మెరుగైనట్లు 25 ఏళ్ల పెరెజ్ పేర్కొన్నాడు. మిగతా ఫార్ములావన్ తరహాలోనే జపాన్ గ్రాండ్ ప్రి కూడా ఉంటుందని.. అయితే ఇక్కడ ప్రజలు ఫార్ములావన్ అమితంగా ఇష్టపడతారన్నాడు. మనం చేసే పని మీద నిబద్ధతతో పాటు నమ్మకం కూడా విజయం తప్పకుండా వస్తుందని పెరెజ్ తెలిపాడు. ప్రస్తుతం 39 పాయింట్లతో ఉన్న పెరెజ్ డ్రైవర్ల స్టాండింగ్ లో 9వ స్థానంలో ఉన్నాడు.