నకిలీ నగల కేసులో ఇద్దరు భారతీయులకు జైలు
నకిలీ నగల కుంభకోణం కేసులో ఇద్దరు భారత జాతీయులు గురుప్రీత్ రామ్ సిద్దు (22), జస్విందర్ సింగ్ బ్రార్ (38)లకు సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించినట్లు స్థానిక మీడియా ద స్ట్రేయిట్ టైమ్స్ గురువారం వెల్లడించింది. రాగి వస్తువులకు బంగారం తాపడం వేసి ఆవి నిజమైన నగలని 11 దుకాణదారులను మోసం చేసిన గురుప్రీత్‌కు 15 నెలల జైలుశిక్ష విధించింది. అలాగే నకిలీ నగల ద్వారా రూ. 30 వేల నగదును పొందిన బ్రార్‌కు 10 నెలల జైలు శిక్ష విధించినట్లు తెలిపింది. వారిద్దరు సోషల్ విజిట్ పాసెస్ ద్వారా సింగపూర్ వచ్చారని పేర్కొంది. గతేడాది ఏప్రిల్, ఆక్టోబర్ మాసాల్లో బ్రార్ ఆ మోసాలకు పాల్పడ్డారని తెలిపింది. అయితే దుకాణదారుల వద్ద ఆ నగలను కుదవ పెట్టి, వారిద్దరు నగదు తీసుకువెళ్లారని చెప్పింది.
అనంతరం దుకాణదారులు నగలను పరీక్షించగా అవి నకిలీ నగలని తెలింది. దాంతో దుకాణదారులు ఆ విషయాన్ని సింగపూర్ పాన్‌బ్రోకర్స్ అసోసియేషన్‌కు సమాచారం అందించారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందని ద స్ట్రేయిట్ టైమ్స్ పేర్కొంది. అయితే తన క్లైయింట్ బ్రార్ ఈ కుంభకోణంలో పాత్ర చాలా తక్కువ అని అతని తరపు న్యాయవాది ఎస్.కే.కుమార్ న్యాయమూర్తికి విన్నవించారు. ఈ నేపథ్యంలో అతనికి తక్కువ శిక్ష విధించాలని కోరారు. శిక్ష కాలం పూర్తి అయన వెంటనే అతడు స్వదేశం వెళ్లిపోతాడని న్యాయమూర్తికి విన్నవించారు. సిద్దు, బ్రార్‌లకు సహకరించిన మరో భారతీయుడు జగత్తర్ సింగ్‌కు వచ్చే నెలలో జైలు శిక్ష ఖరారుకానుందని ద స్ట్రైయిట్ టైమ్స్ తెలిపింది.