నెమ్మదించిన దేశీ కార్ల విక్రయాలు
♦ హరియాణా జాట్ రిజర్వేషన్ ఆందోళన కారణం
♦ స్వల్ప వృద్ధిని ప్రకటించిన మారుతీ
♦ హ్యుందాయ్ అమ్మకాల వృద్ధి 9 శాతం
న్యూఢిల్లీ: దేశీ కార్ల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో నెమ్మదించాయి. హరియాణాలో జరిగిన జాట్ రిజర్వేషన్ అందోళన ప్రభావం విక్రయాలపై పడింది. దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీ తన దేశీ విక్రయాల్లో స్వల్ప వృద్ధిని ప్రకటించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా కార్ల విక్రయాలు పెరిగాయి. టాటా మోటార్స్ దేశీ ప్యాసెంజర్ వాహన విక్రయాలు మాత్రం తగ్గాయి. ఇక టూవీలర్ల విక్రయాలు బాగా జరిగాయి.
టాటా మోటార్స్ ప్యాసెంజర్ వాహన ధరలు అప్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తాజాగా ప్యాసెంజర్ వాహన విక్రయాలను రూ.35,000 వరకు పెంచింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. జైట్లీ తన తాజా 2016 -17 బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్సు విధిస్తున్నట్లు ప్రకటించడమే తమ ధరల పెంపు నిర్ణయానికి కారణమని పేర్కొంది. వివిధ విభాగాలపై ఉన్న సెస్సు శాతాన్ని బట్టి ఆయా వాహన ధరలు పెంపు రూ.2,000-రూ.35,000 శ్రేణిలో ఉంటుందని వివరించింది. వీటి ధరలు రూ. 2.04 లక్షలు- రూ.15.79 లక్షల శ్రేణిలో ఉన్నాయి. ఇవి ఎక్స్ షోరూమ్ ఢిల్లీవి. కాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇం డియా కంపెనీలు కూడా వాటి ప్యాసెంజర్ వాహన ధరలను పెంచాలని భావిస్తున్నాయి.
2.5 శాతం వరకూ సెస్‌కు నోటిఫికేషన్...
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా పాసింజర్ కార్లపై 2.5 శాతం వరకూ ఇన్ఫ్రా సెస్ అమలుకు మంగళవారం నోటిఫికేషన్ జారీ అయింది. అయితే పెద్ద డీజిల్ ఎస్‌యూవీలు, కార్లపై 4 శాతం సుంకాల విధింపు అంశం నోటిఫికేషన్లో పేర్కొనలేదు.