మరవని మజిలీ కావాలి
పాపన్నపేట: ‘తరగని భక్తికి.. పర్యాటక అందాలకు నిలయం ఏడుపాయల. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి జాతర ఇది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఈ వేడుకలు మరచిపోని మజిలీ కావాలి. అధికారులంతా సమన్వయంతో పనిచేసి జాతరను జయప్రదం చేయాలి. ఎలాంటి అవకతవకలు జరిగినా.. అవమానాల పాలవుతాం’ అంటూ.. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి శనివారం ఏడుపాయల్లో జరిగిన జాతర సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు జరిగే ఏడుపాయల జాతరకు సంబంధించి 20 శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా, డిప్యూటీ స్పీకర్లు అధికారుల విధులను, ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. జాతరకు సుమారు 7లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్ట్‌కు 0.3టీఎంసీ నీటిని విడుదల చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్, కలెక్టర్లు తెలిపారు.
ఫిబ్రవరి 15 వరకే నీరు వచ్చేలా చూస్తామన్నారు. జాతరకు దేవాదాయ శాఖ నుండి సుమారు రూ.27లక్షలు ఖర్చు చేస్తామని, ప్రభుత్వ పరంగా మరిన్ని నిధులు మంజూరు చేయాలని ఏడుపాయల చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి కోరారు. జాతర భక్తులకు 30లక్షల లీటర్ల నీటిని పంపిణీ చేస్తామని, ఆర్డ బ్ల్యుఎస్ ఈఈ విజయ్‌ప్రకాశ్ తెలిపారు. 24గంటలపాటు విద్యుత్ సేవలందిస్తామని, 13 అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ సదాశివారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా నుంచి 120, హైదరాబాద్ నుంచి 50 బస్సులను ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
300 మంది పారిశుద్ధ్య కార్మికులతో జాతరలో చర్యలు చేపట్టనున్నట్లు డీపీఓ ప్రభాకర్‌రెడ్డి వివరించారు. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు 24గంటలపాటు వైద్య సేవలందిస్తామని డీఎంహెచ్ఓ బాలాజీ పవర్ తెలిపారు. ఇద్దరు డిఎస్పీలు, 10మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, 1250 మంది పోలీసులతో భద్రత చర్యలు చేపట్టనున్నట్లు డీఎస్పీ రాజారత్నం తెలిపారు. జాతర ప్రారంభోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి వచ్చే అవకాశం ఉన్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు.
జాతరలో చిరు వ్యాపారులు రోడ్లపైకి రాకుండా చూడాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావద్దని, స్నానాలు చేసే సమయంలో ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జాలు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ ప్రసాద్, ఈఓ వెంకటకిషన్రావులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ మెంచు నగేష్, స్థానిక సర్పంచ్ ఇందిర నర్సింలుగౌడ్, ఎంపీపీ పవిత్ర, జెడ్పీటీసీ స్వప్న, ఎంపీటీసీ సత్యనారాయణ, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.