భారత ఖైదీల విడుదలకు పాక్ పచ్చజెండా
ముంబై: పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీలను విడుదల చేసేందుకు అక్కడి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ క్రమంలో 338 మంది భారతీయ ఖై దీలను విడుదల చేసేందుకు పాక్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వీరు శుక్రవారం విడుదలయ్యే అవకాశముందని, శనివారం నాటికి ఖైదీలంతా స్వదేశానికి చేరతారని పాకిస్థాన్లోని న్యాయ సహాయ కార్యాలయం ప్రతినిధి రిజ్వనుల్లా జమిల్ వెల్లడించినట్టు భారత్-పాక్ శాంతి ఉద్యమ కారుడు జతిన్ దేశాయ్ బుధవారం ఇక్కడ వెల్లడించారు.
కరాచీలోని రెండు వేర్వేరు జైళ్ల నుంచి విడుదల చేస్తున్న ఈ ఖైదీలను ప్రత్యేక ఏసీ బస్సుల్లో లాహోర్లోని వాఘా, అమృత్సర్లోని అట్టారీ సరిహద్దుల గుండా భారత్కు పంపించనున్నట్టు తెలిపారు. ఖైదీల విడుదల నిర్ణయానికి సంబంధించిన అన్ని పనులూ ఇప్పటికే పూర్తయ్యాయని, ఖైదీలుగా ఉన్న 330 మంది జాలర్లు, ఎనిమిది మంది బాల నేరస్తులను విడుదల చేస్తున్నట్టు జమిల్ చెప్పారని అన్నారు. ‘భారత ఖైదీలను పాక్ విడుదల చేయడం ఆనందదాయకం’ అని జమిల్ అన్నట్టు దేశాయ్ తెలిపారు.