Jats quota
-
జాట్ కోటా అమలుపై హైకోర్టు స్టే
న్యూఢిల్లీః బీసీ(సీ) కేటగిరీ కింద జాట్లు, ఐదు ఇతర కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్ననిర్ణయం రాజ్యాంగ చెల్లుబాటును పంజాబ్ హర్యానా హైకోర్టు సమర్ధించినా దాని అమలుపై స్టే విధించింది. జాట్ కోటాపై దాఖలైన పిటిషన్ను కోర్టు జాతీయ బీసీ కమిషన్కు నివేదించింది. 2018, మార్చి 31న కమిషన్ తన నివేదికను సమర్పించనుంది. అప్పటివరకూ జాట్లు, ఇతర ఐదు కులాలకు రిజర్వేషన్ల నిర్ణయం అమలును నిలిపివేసింది. గతంలో 2016, మే 26న హైకోర్టు డివిజన్ బెంచ్ జాట్లు, ఇతర కులాలకు రిజర్వేషన్లపై స్టే విధించింది. ఈ నిర్ణయం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై డివిజన్ బెంచ్ స్టే ఉత్తర్వులు జారీ చేసింది.అయితే దేశంలో భిన్న భౌగోళిక, సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వేషన్ విధానాల్లో సారూప్యత ఉండాల్సిన అవసరం లేదని హర్యానా ప్రభుత్వం వాదించింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఏ కులానికైనా రిజర్వేషన్లు కల్పించవచ్చని కొన్ని కేసుల్లో సుప్రీం కోర్టు పేర్కొన్న ఉదంతాలను ప్రస్తావించింది. -
జాట్ రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
చండీగఢ్: విద్యా, ఉద్యోగ రంగాల్లో జాట్ కులస్తులు సహా మరో నాలుగు కులాలకు రిజర్వేషన్లు వర్తింపజేసే కీలక బిల్లుకు హరియాణా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏప్రిల్ 3లోగా తమను బీసీ జాబితాలో చేర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ జాట్లు విధించించిన డెడ్ లైన్ దృష్ట్యా ప్రభుత్వం ఆమేరకు చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాలు మార్చి 31తో ముగియనుండటంతో ఆలోపే జాట్ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్ ఆమోదించిన బిల్లులోని వివరాలు ఇలా ఉన్నాయి జాట్లకు రిజర్వేషన్లు కల్పించేలా బీసీ జాబితాలోనే మరో కేటగిరీని పొందుపర్చారు విద్యారంగంలో, క్లాస్ 3, క్లాస్ 4 ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు ఈ 10 శాతంలో 6 శాతం జాట్లకు కాగా మిగతా 4 శాతం జాట్ సిక్కులు, రోర్లు, బిష్ణోయిలకు లభిస్తుంది. పదేపదే రిజర్వేషన్ల ఆందోళనలు తలెత్తకుండా హరియాణా వెనుకబడిన కులాల కమిషన్ పేరుతో ఓ శాశ్వత సంస్థను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాట్లకు రిజర్వేషన్ కల్పించాలంటూ ఆ కులస్తులు గత నెలలో చేపట్టిన ఆందోళనలు హింసాయుతంగా మారిన సంగతి తెలిసిందే. నాటి అల్లర్లలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికిపైగా గాయపడ్డారు. వందల సంఖ్యలో రైళ్లు నిలిచిపోయాయి. డిమాండ్లను పరిష్కరిస్తామన్న ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించిన జాట్లు.. ఏప్రిల్ 3లోగా పరిష్కారం లభించకుంటే మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వడివడిగా నిర్ణయాలు తీసుకుంటున్నది.