ఇలా అయితే ఎలా?: పాక్ కెప్టెన్ అసహనం
గయానా: మహిళల వరల్డ్ టీ20లో భాగంగా ఆదివారం భారత్ జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్కు 10 పరుగుల పెనాల్టీ పడిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు నిదా దార్, బిస్మా మరూఫ్లు బ్యాటింగ్ చేసే క్రమంలో పదే పదే డేంజర్ ఏరియాలో పరుగెత్తడంతో ఆ జట్టు 10 పరుగుల కోతను ఎదుర్కొంది. అయితే దీనిపై పాక్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ జవిరియా ఖాన్..తమ క్రికెటర్లపై అసహనం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ సిల్లీ తప్పిదాలు చేయడాన్ని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా వృత్తిధర్మం కాదంటూ క్లాస్ తీసుకున్నారు.
‘మా క్రికెటర్ల చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. మేము ఇంకా డేంజర్ ఏరియాలో పరుగెత్తుతూ తప్పులు చేయడం మింగుడు పడటం లేదు. మా జట్టు ఇలా చేయడం తొలిసారేం కాదు.. గతంలో శ్రీలంకతో సిరీస్ సందర్భంగా కూడా మేము ఇవే తప్పిదాలు చేశాం. దీన్ని అధిగమించడంపై మా మహిళా క్రికెటర్లు దృష్టి సారించాల్సి ఉంది. ప్రస్తుతం చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటారనే ఆశిస్తున్నా. మేము అలా పెనాల్టీ బారిన పడకుండా ఉండి ఉంటే ఒక మంచి మ్యాచ్ జరిగేది’ అని జవిరియా ఖాన్ తెలిపారు. ఈ మ్యాచ్లో భారత మహిళా జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. పాకిస్తాన్ నిర్దేశించిన 134 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిథాలీ రాజ్ (47 బంతుల్లో 56; 7 ఫోర్లు) రాణించడంతో భారత్ గెలుపును అందుకుంది.