అమెరికా ట్రెజరీలో భారతీయుడికి చోటు
వాషింగ్టన్: అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి వరించింది. ట్రెజరీ శాఖలోని కంప్ట్రోలర్ ఆఫ్ ద కరెన్సీ(ఓసీసీ)లో అప్లికేషన్ సర్వీసెస్ డెలివరీ విభాగానికి ఉప ముఖ్య సమాచార అధికారిగా జవహర్ కల్యాణి నియమితులయ్యారు. అప్లికేషన్ల అభివృద్ధి, అమలు కార్యక్రమాలకు ఆయన నేతృత్వం వహించనున్నారని ఒక ప్రకటన జారీ అయింది. జవహర్‌కు ఉన్న అనుభవంతో ఈ బాధ్యతలు గొప్పగా నిర్వహించగలరని ఓసీసీ ముఖ్య సమాచార అధికారి ఎడ్వర్డ్ డోరిస్ తెలిపారు. ఇప్పటి వరకు జవహర్ కల్యాణి ఆమ్‌డాస్ ఇంక్ అనే కంపెనీలో పనిచేశారు. అక్కడ కస్టమర్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ప్రముఖ టెలికం కంపెనీలకు బిజినెస్ ఐటీ సొల్యూషన్లు, ఇతర సేవల అభివృద్ధి, నిర్వహణ, పంపిణీ వంటి కీలక బాధ్యతలు చూశారు. ఈ రంగంలో ఆయనకు 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ముంబైలోని వీరమాత జిజాబాయ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి బీఈ పూర్తి చేసిన జవహర్ కల్యాణి అనంతరం అమెరికాలో ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి ఎంబీయే పట్టా అందుకున్నారు.