‘ఫైన్ఆర్ట్స్’ ప్రవేశాల్లో గందరగోళం!
ఓపెన్ కోటాలో పూర్తి సీట్లు భర్తీ చేయకపోవడంపై ఆందోళన
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ఆర్ట్స్ వర్సిటీ ప్రవేశాల్లో గందరగోళం జరిగిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఓపెన్ కోటాలో సీట్లను భర్తీ చేయకుండా వాటిని పక్కనపెట్టి అర్హులైన వారికి అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. వర్సిటీలోని ఫైన్ఆర్ట్స్ విభాగంలో బీఎఫ్ఏ కోర్సు కింద అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, యానిమేషన్, ఫొటోగ్రఫీ, శిల్పకళతో పాటు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులు ఉన్నాయి. వీటిలో 60 సీట్ల చొప్పున ఉన్న యానిమేషన్, ఇంటీరియర్ డిజైనింగ్ విభాగాలు అన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులే.
ఇవికాక మిగిలిన విభాగాల్లో రెగ్యులర్ కోర్సులున్నాయి. రెగ్యులర్ కోర్సుల్లోని సీట్లలో 15% సీట్లు ఓపెన్ కోటాలో భర్తీ చేయాల్సి ఉండగా, మిగిలిన 85% సీట్లను ఆంధ్రా, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర వర్సిటీల వారికి 42:36:22 నిష్పత్తిలో కేటాయిస్తారు. సాధారణంగా ఓపెన్ కోటా సీట్లను భర్తీ చేశాక రిజర్వేషన్ కోటా సీట్లు భర్తీ చేస్తారు. ఓపెన్ కోటాలో అన్ని సీట్లు భర్తీ చేయకుండా పక్కన పెట్టడం అనుమానాలకు తావిస్తోంది.
ఇదీ ఉదాహరణ..
ఫొటోగ్రఫీ విభాగంలో 30 జనరల్, 15 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుండగా తొలి జాబితాలో 26 జనరల్, 9 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కేటాయిం చారు. ముందు ఓపెన్ కోటా సీట్లు భర్తీ చేశాక యూనివర్సిటీల నిష్పత్తి, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. అధికారులు ఓపెన్ కోటాలో రెండు సీట్లే భర్తీ చేసి, రెండు ఖాళీలు ఉంచి జాబితా ప్రకటించారు. ఓపెన్ కోటాలోని 4 సీట్లను, సెల్ఫ్ ఫైనాన్స్‌లో 6 సీట్లను భర్తీ చేయకుండా పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.