మళ్లీ ప్రొఫెసర్‌గా మన్మోహన్!
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తాను చదువుకున్న, పాఠాలు చెప్పిన పంజాబ్ వర్సిటీకి తిరిగి వెళ్లనున్నారు. గతంలో ఆయనను జవహర్లాల్ నెహ్రూ చైర్ ప్రొఫెసర్‌షిప్‌గా వ్యవహరించాలని పంజాబ్ వర్సిటీ కోరింది. అయితే అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న మన్మోహన్ తాను ఆ పదవిని అలంకరిస్తే సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుందా అని రాజ్యసభ చైర్మన్‌ను అడిగారు.
దీనిపై ఏర్పాటైన కమిటీ ఈ నెల 14న లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక ఇచ్చింది. వర్సిటీ ప్రతిపాదించిన పదవిని మన్మోహన్ చేపడితే అది లాభదాయక పదవి కిందికి రాదని అందులో పేర్కొన్నారు. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి వచ్చే ముప్పేమీ లేదని తెలిపింది. దీంతో త్వరలోనే ఆయన యూనివర్సిటీలో జవహర్లాల్ నెహ్రూ చైర్ ప్రొఫెసర్‌షిప్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.