సమైక్యం ఒక భావన.. తెలంగాణ ఓ హక్కు
సాక్షి, నల్లగొండ: సమైక్యంగా ఉండడ మనేది ఒక భావన మాత్రమేనని..ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజల హక్కు అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నల్లగొండలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సభల్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో నివసిస్తున్న సీమాంధ్రుల హక్కులకు ఎటువంటి విఘాతం కలగ నివ్వబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులూ హైదరాబాద్లో నివసించే వారికి వర్తిస్తాయన్నారు.
ఈ విషయంలో సీమాంధ్ర నాయకులు అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని, వాటికి దూరంగా ఉండాలని కోరారు. దశాబ్దాల పోరాటం ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కార్యరూపం దాల్చేదాకా అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. విభజనను అడ్డుకునేందుకు యత్నిస్తున్న సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ప్రేమకు నిరాకరించిన యువతిపై కర్కశంగా యాసిడ్ దాడి చేయడం ఎంతనేరమో బలవంతంగా కలిసి ఉండాలని కోరుకోవడమూ అంతేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదే రాజధాని అని, అది గంగ, యమున నదుల్లా తెలంగాణలో కలిసిపోయిందని తెలిపారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని మాత్రమే అంగీకరిస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటుతోనే అమరవీరుల ఆత్మలు శాంతిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక కాంట్రాక్ట్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, దీన్ని తమ కర్తవ్యంగా భావిస్తున్నామని డ్వామా అధికారులకు కోదండరాం హామీ ఇచ్చారు.