చెక్కు ఇచ్చి చెక్కేశాడు..!
⇒ప్రైవేట్ సంస్థ ఉద్యోగికి టోకరా
⇒రూ.1,46లక్షలతో పరారీ
సనత్‌నగర్: నగదు డిపాజిట్ చేసేందుకు బ్యాంక్‌కు వచ్చిన ఓ వ్యక్తి దృష్టి మరల్చడమే కాకుండా బ్యాంక్ సిబ్బందిని బురిడీ కొట్టించి రూ.1,46,000లతో పరారైన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రవీందర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..ఎస్ఆర్నగర్లోని జయ సర్జికల్ అండ్ ఫార్మా కంపెనీ ఉద్యోగి వినీల్‌రెడ్డి ఈ నెల 22న నగదు జమ చేసేందుకు బేగంపేట హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు వెళ్లాడు. రూ. రెండు లక్షలు ఒక కవర్లో, 1.40లక్షలు మరో కవర్లో పట్టుకుని డిపాజిట్ చేసేందుకు క్యూ లైన్లో నిలుచున్నాడు. అతని వద్దకు వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి మీ కంపెనీకి రూ. 3లోలు చెల్లించాల్సింది ఉందని, మీ యజమాని చెక్ ఇవ్వమని చెప్పాడు. అయితే తమ మేడమ్ తనకు ఏమీ చెప్పలేదని వినీల్‌రెడ్డి చెప్పడంతో మీ యజమానితో మాట్లాడతానంటూ ఫోన్ చేసినట్లుగా నటించి వినీల్‌రెడ్డిని నమ్మించాడు.
మీ మేడమ్ చెక్కు ఇవ్వమని చెప్పిందని, ఇద్దరం డిపాజిట్ చేద్దామంటూ లైన్లో నిల్చున్నారు. వీరిరువురి సంభాషణను బట్టి ఇద్దరు ఒకే సంస్థకు చెందిన వారిగా క్యాషియర్ భావించాడు. వినీల్‌రెడ్డి తన వద్ద ఉన్న నగదు, గుర్తుతెలియని వ్యక్తి చెక్కును ఒకేసారి క్యాషియర్‌కు ఇచ్చారు. అయితే ఇంకా కొంత నగదు ఉందని ఇప్పుడే వద్దామని బ్యాంక్ పై అంతస్తుకు వినీల్‌రెడ్డిని తీసుకెళ్లే ప్రయత్నంలో బయటికి వచ్చారు. అదే సమయంలో లిఫ్ట్ పైకి వెళ్లడంతో మరో లిఫ్ట్ ఉందేమో చూసి వస్తానని చెప్పి గుర్తుతెలియని అగంతకుడు అక్కడి నుంచి నేరుగా క్యాషియర్ దగ్గరకు వెళ్లి, ఎక్కువ మొత్తం ఉన్న కవర్‌ను ఉంచి తక్కువ నగదు ఉన్న కవర్ ఇవ్వాలని చెప్పడంతో క్యాషియర్ రూ.1.46 లక్షలు నగదు ఇచ్చాడు.
కవర్ తీసుకున్న అతను అక్కడి నుంచి పరారయ్యాడు. అతను ఎంతకూ రాకపోవడంతో వినీల్‌రెడ్డి తిరిగి క్యాషియర్ దగ్గరకు వచ్చి తాను ఇచ్చిన డబ్బును డిపాజిట్ చేయాల్సిందిగా కోరడంతో ఒక కవర్ మీతో పాటు వచ్చిన వ్యక్తి తీసుకువెళ్లాడని చెప్పడంతో అవాక్కయ్యాడు. దీంతో అగంతకుడు ఇచ్చిన చెక్కును తీసుకుని బేగంపేట పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.