తలవంపులు తెచ్చారు
అధికార పార్టీ తీరుపై స్టాలిన్ ఫైర్
నేడు తంజావూరు, నాగైలలో పర్యటన
చెన్నై: అన్నాడీఎంకే వర్గాల తీరు సిగ్గు చేటు అని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడుకు తలవంపులు తె చ్చే రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం చెన్నైలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి, సహాయకాల్ని అందించిన స్టాలిన్ మంగళవారం తంజావూరు, నాగపట్నంలలో పర్యటించనున్నారు.
వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి, డీఎం కే తరఫున సహాయక చర్యల్ని ఎంకే స్టాలిన్ వేగవంతం చేస్తూ వస్తున్న వి షయం తెలిసిందే. సోమవారం చెన్నైలోని ఆర్ఏ పురం, చేపాక్కం నియోజకవర్గం పరిధిలోని ప లు ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటించారు. వరద బాధితులకు భరోసా ఇస్తూ, సహాయకాలను అందజేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ సహాయక చర్యల్ని రాజకీయం చేయదలచుకోలేదన్నారు. అయితే, అన్నాడీఎంకే వర్గాలు వ్యవహరిస్తున్న తీరు సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న సంస్థల మీద తమ ప్రతాపం చూపిస్తుండడం, అడ్డుకోవడం, అమ్మ బొమ్మలకు ఒత్తిడి తీసుకురావడం విచారకరంగా పేర్కొన్నారు. వీరి చర్యలు తమిళనాడుకే తలవంపులు తీసుకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు సైతం సీఎం బొమ్మను చేత బట్టి తిరుగుతుండడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
నేడు తంజావూరుకు: తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నైలలో పర్యటించి వరద బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటుగా సహాయకాల్ని అందిస్తూ వచ్చిన స్టాలిన్ ఇక మంగళవారం నుంచి తంజావూరు, నాగపట్నం, తిరువారూర్, కడలూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం తంజావూరులో పర్యటించి ప్రజల్ని కలుసుకోనున్నారు. అనంతరం తిరువారూర్లో అన్నదాతల్ని సంప్రదించనున్నారు. తదుపరి నాగపట్నంలో జాలర్లకు భరోసా ఇవ్వనున్నారు. బుధవారం కడలూరులో పర్యటించి, అక్కడి బాధితులకు ఓదార్చడంతో పాటుగా డీఎంకే తరఫున సహాయక చర్యలు ముమ్మరం చేయనున్నారు.