జైలు నుంచి శశికళ లేఖ!
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ.. తన సొంత రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలకు ఓ లేఖ రాశారు. ఈనెల 24వ తేదీ శుక్రవారం నాడు జయలలిత పుట్టినరోజు కావడం, మరణించిన తర్వాత తొలిసారి ఆమె జయంతి రావడంతో దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని చిన్నమ్మ శశికళ పార్టీ వర్గాలకు తెలిపారు. ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పార్టీని వెన్నుపోటు పొడవాలనుకున్నవారి ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నామని.. ఎంజీఆర్ వారసత్వం, జయలలిత కృషిని నీరు కారుద్దామనుకున్నవారి కుట్రలు సాగనివ్వలేదని అన్నారు. ఎంజీఆర్ శతజయంతి సంవత్సరంలో అమ్మ పాలనను కాపాడుకున్నామని రాశారు.
పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, తన అక్క కొడుకు అయిన టీటీవీ దినకరన్ ఆమెను బెంగళూరు జైల్లో కలిసిన ఒక్కరోజు తర్వాత జైలు నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. పార్టీ కార్యాలయంలో జయలలిత ఫొటోకు ప్రిసీడియం చైర్మన్ కేఏ సెంగొట్టియాన్ పూల మాల వేస్తారని మరో ప్రకటనలో తెలిపారు.