పెరిగిపోతున్న అమ్మ అభిమానుల మరణాలు
చెన్నై: పురచ్చితలైవి జె.జయలలిత చనిపోయారన్న వార్తను అన్నాడీఎంకే కార్యకర్తలు, ఆమె అభిమానులు, మద్ధతుదారులు జీర్ణించుకోలేక పోతున్నారు. గత సోమవారం రాత్రి ఆమె మృతిచెందినట్లు ప్రకటించిన తర్వాత నుంచి ఇప్పటివరకూ 280 మంది అమ్మ అభిమానులు చనిపోయినట్లు అన్నాడీఎంకే నేతలు శనివారం వెల్లడించారు. అదేవిధంగా మృతిచెందిన వారి ప్రతి కుటుంబానికి రూ.3 లక్షలు పరిహారం చెల్లించనున్నట్లు పార్టీ ప్రకటించింది.
పార్టీ గత ప్రకటనలో 77 మంది మృతిచెందినట్లు పేర్కొనగా, మృతులసంఖ్య పెరిగిపోతుందని ప్రస్తుతం 280 మంది చనిపోయినట్లు అన్నాడీఎంకే పార్టీ పేర్కొంది. ఇందులో ఎక్కువగా చెన్నై, వెల్లూర్, తిరువళ్లూర్, తిరువన్నమలై, కుడ్డలూర్, క్రిష్ణగిరి, ఎరోడ్, తిర్పూర్ జిల్లాలలోనే జయలలిత అభిమానులు, మధ్దతుదారులు ఎక్కువగా మృతిచెందినట్లు వివరించారు. సెప్టెంబర్ 22న తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత గత సోమవారం రోజు కన్నుమూసిన విషయం తెలిసిందే. అమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని, త్వరలో ఇంటికి తిరిగి వెళ్లనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో గుండెపోటు రావడంతో ఆరోగ్యం క్షీణించి ఆమె కన్నుమూయడంతో జయ ఇక లేరన్న ఈ నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. దీంతో మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని అన్నాడీఎంకే నేతలు అభిప్రాయపడుతున్నారు.