అమ్మ కోసం...
- నలుగురి మృతి
- కొనసాగుతున్న దీక్షలు
చెన్నై, సాక్షి ప్రతినిధి : అమ్మ జైలుకెళ్లిందన్న ఆవేదనతో మరో నలుగురు కన్నుమూశారు. కొందర్ని గుండెపోటు కబళించగా, మరికొం దరు ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం సైతం రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు కొనసాగాయి. సేలం జిల్లాకు చెందిన పెరియస్వామి (52) మంగళవారం రాత్రి ఉరివేసుకుని, నాగపట్నం జిల్లా సంబంధం (54) బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. విలుపురం జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థిని సంగీత (16) ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతి చేసుకోగా, అదే జిల్లాకు చెందిన చక్రవర్తి (55) గుండెపోటుతో మరణించాడు. తిరువెన్నై నల్లూరుకు చెందిన కన్నన్ (25) విషం తాగి, ధర్మపురి జిల్లాకు చెందిన రాజామూర్తి (30) తిరువారూరుకు సమీపంపలోని సెల్ఫోన్ టవర్ ఎక్కి, తిరుపత్తూరుకు చెందిన సుబ్రమణి కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించారు.
జయను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రంలో బుధవారం సైతం అనేక ఆందోళనలు కొనసాగాయి. పుదుక్కోట్టై జిల్లా కొట్టైపట్టినం, జగదాపట్టినం, మీనమేల్కుడి తదితర మత్స్యకార గ్రామాలకు చెందిన జాలర్లు సమ్మెకు దిగారు. జాలర్ల సమస్యలకు అమ్మ అండగా నిలువగా, జయ జైలుపాలు కావడంతో శ్రీలంక మళ్లీ రెచ్చిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకనే అమ్మ విడుదలయ్యేవరకు చేపల వేటకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. విరుదాచలంలో ఉద్యోగుల సమాఖ్య సమావేశంలో అమ్మకు మద్దతుగా అన్నాడీఎంకే కౌన్సిలర్ అరుళ్ గుండు గీయించుకున్నారు. తిరుపత్తూరులో అద్దకపు పరిశ్రమల వారు సమ్మె పాటించారు.
నగరంలోని వస్త్రదుకాణలన్నీ మూతపడ్డాయి. చెన్నై రాయపురంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ టీ జయకుమార్ ఆధ్వర్యంలోనూ నిరాహార దీక్ష, అన్నాడీఎంకే అనుబంధ శాఖల వారు మానవహారం పాటించారు. తిరువత్తూరులోని తేరడిలో అన్నాడీఎంకే కార్యకర్తలు నిరాహారదీక్షకు దిగారు. రామేశ్వరంలోని ఆగ్నితీర్థ సముద్రతీరంలో అన్నాడీఎంకే కార్యకర్తలు 1008 సార్లు సముద్రంలో మునిగి అమ్మకోసం ప్రార్థనలు చేశారు. సేలం జిల్లాలో హిజ్రాలు అమ్మకు మద్దతుగా నిరాహారదీక్ష చేశారు.