జయలలిత ఇల్లు ఇప్పుడు ఎలా మారబోతోంది?
తమిళనాట రాజకీయాల్లో ధీరవనితగా నిలిచి అసువులు బాసిన జయలలితకు అమ్మంటే అమితమైన ప్రేమ. ఆ ప్రేమతో తల్లి వేదవల్లి పేరుని తన ఇంటికి పెట్టుకున్నారు. చెన్నై నడిమధ్యన పోయస్ గార్డెన్లో ఉండే తన నివాసాన్ని వేదనిలయంగా మార్చారు. అయితే జయలలిత మరణ అనంతరం ఈ ఇల్లు ఎవరికి చెందుతుందా? అని పలువాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఇంటికి తామెంటే తాము వారసులమని కొంతమంది లైన్లోకి వస్తున్నారు. దీంతో పోయస్ గార్డెన్‌లోని వేదనిలయాన్ని జయలలిత స్మారకమందిరంగా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ నిలయాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని జయలలిత స్మారకమందిరంగా మార్చేందుకే టీఎన్‌సీసీ(తమిళనాడు కాంగ్రెస్ కమిటీ) కూడా మొగ్గుచూపింది. జయలలిత వాడిన వస్తువులను ప్రజలు తిలకించేందుకు అనుమతి ఇవ్వాలని కూడా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఎస్. తిరునవుక్కరసర్ కోరారు.
జయలలిత అనారోగ్య వార్త, మరణ వార్త విని 77 మంది మృతిచెందారని ఆయన చెప్పారు. వారందరికీ ఆయన సంతాపం తెలిపారు. పుదేచ్చెరిలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న అన్నాడీఎంకే, ఈ కేంద్రపాలిత ప్రాంతంలో జయలలిత జీవిత కాల సైజులో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వి. నారాయణస్వామికి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి కేబినెట్ భేటీ కానున్నట్టు నారాయణస్వామి చెప్పినట్టు అన్నాడీఎంకే వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం జయలలిత నివాసంలో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమె స్నేహితురాలు శశికళ, ఆమె బంధువులు నివసిస్తున్నారు.