కొత్తవాళ్లతో జయంత్ రియలిస్టిక్ సినిమా
‘ప్రేమించుకుందాం రా’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘బావగారు బాగున్నారా’, ‘టక్కరి దొంగ’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’, ‘లక్ష్మీ నరసింహ’... ఇలా దర్శకుడు జయంత్ సి. పరాన్జీ తెలుగులో టాప్ హీరోలతో టాప్ సినిమాలు తీశారు. నాలుగేళ్ల క్రితం పవన్‌కల్యాణ్‌తో ‘తీన్మార్’ తీసిన జయంత్ ఆ తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు.
నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆయన మెగాఫోన్ పట్టనున్నారు. అయితే అది ఆయన శైలిలో సాగే రొమాంటిక్ మాస్, ఎంటర్టైనర్ సినిమా మాత్రం కాదు. పాటలు, రొమాన్స్ ఇలాంటివేమి లేకుండా వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే సినిమా తీయాలనుకుంటున్నారాయన. దీని గురించి జయంత్ చె బుతూ - ‘‘ఇప్పటి వరకూ హీరోలను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్‌లు రెడీ చేశాను. కానీ బోర్ కొట్టేసింది.
ఇప్పుడు నా శైలికి భిన్నంగా ఉండే సినిమా తీయనున్నా. తాగుడుకు బానిసై సస్పెండ్ అయిన ఓ పోలీస్ ఆఫీసర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనే నేరం మీద ఎలా పోరాటం సాగించాడనే కథాంశంతో చాలా రియలిస్టిక్‌గా తీద్దామనుకుంటున్నా. కొత్త వాళ్లతోనే ఈ సినిమా చేయనున్నా. ఎందుకంటే ప్రేక్షకులు కొత్త వాళ్ల నుంచి ఏమీ ఆశించరు’’ అన్నారు.