జీవధార ఘంటసాల గానం
ఘనంగా అమర గాయకుడి జయంతి
రాజమహేంద్రవరం కల్చరల్ :
వేదనాదమే ఘంటసాల గళం నుంచి సంగీతంగా రూపుదిద్దుకుని జీవధారలు కురిపించిందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కొనియాడారు. గోదావరి సింగర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం అమర గాయకుడు ఘంటసాల జయంతిని ఘనంగా నిర్వహించారు. గోదావరి గట్టుపై ఉన్న ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోము మాట్లాడుతూ ఘంటసాల సంగీతంలో జీవించారని, పాటను రక్తి కట్టించడంలో, అందరినీ పాట ద్వారా రంజింపచేయడంలో ఆయనకు ఆయనే సాటిని పేర్కొన్నారు. ఘంటసాల మనసున్న గాయకుడు... మనసు విప్పి పాడారు... అందుకే నేటికీ ఆయన పాటలు అందర్నీ అలరింపజేస్తున్నాయని చెప్పారు. ఘంటసాల స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేసీ నాయకుడు ధార్వాడ రామకృష్ణ, ఘంటసాల విగ్రహ వ్యవస్థాపకుడు రాయడు చంద్రకుమార్, పిరాట్ల శ్రీహరి, ఘంటసాల శ్యామలాకుమారి, కోసూరి చండీప్రియ, రాళ్ళపల్లి నీలాద్రి, రాళ్ళపల్లి శ్రీనివాస్, సన్నిధానం శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.