చివరి రెండు రోజులు కీలకం
♦ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
♦ జేసీ రవీందర్‌రెడ్డి ఆదేశం
కందకుర్తి సాక్షి బృందం : గోదావరి మహాపుష్కరాలలో మిగిలిన చివరి రెండు రోజులు చాలా కీలకమని జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి అన్నారు. ఈ రెండు రోజులలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమన్వయంతో వ్యవహరించాలని సూ చించారు. గురువారం సాయంత్రం ఆయన కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పది రోజులపాటు విధులు విజయవంతంగా నిర్వహించారని అధికారులను ప్రశంసించారు.
ఏర్పాట్లలో రాష్ట్రంలోనే కందకుర్తి ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని 18 పుష్కర క్షేత్రాలలో గురువారం నాటికి 72 లక్షల మంది పుష్కర స్నానం ఆచరించారని వెల్లడించారు. మిగిలిన రెండు రోజులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందకు సూచనలు సలహాలు ఇవ్వాలని అధికారులను కోరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్యం, సౌకర్యాలు, భద్రతపై దృష్టి సారించాలన్నారు. పుష్కరాల ముగింపు శనివారం లక్ష దీ పారాధన, వనదుర్గ ఆలయం నుంచి అమ్మవారి విగ్రహ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. కందకుర్తిలోని కేశవస్మృతి మందిరం నుంచి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హారతి ఊరేగింపు ప్రారంభమై నది వద్దకు చేరుకుంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, తహసీల్దార్లు రాజేశ్వర్, వెంకటయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గోదారమ్మకు హారతి ఇచ్చిన జేసీ
కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలో గోదావరి నదికి జేసీ రవీందర్‌రెడ్డి హారతి ఇచ్చారు. గ్రామంలోని రామాలయం నుంచి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పిట్ల కృష్ణ మహా రాజ్ సారథ్యంలో మహిళలు నది వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పంటలు సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.