అవసరమైతే 20 గంటలు పనిచేస్తా
జేసీ సత్యనారాయణ కలెక్టరేట్లో బాధ్యతల స్వీకరణ
రాంనగర్ : బంగారు తెలంగాణ కోసం అవసరమైతే 20 గంటలు పనిచేసేందుకు కూడా వెనుకాడబోనని నూతన జాయింట్ కలెక్టర్‌గా సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన జేసీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు వంద శాతం విజయవంతం అయ్యే విధంగా పని చేస్తానని తెలిపారు. ఉద్యోగులందరి సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లానుంచి కొన్ని కీలక పథకాలు మొదలు పెడుతుందని, వాటిని సజావుగా పూర్తి చేసేందుకు తన శక్తి మేరకు పని చేస్తానన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అనంతరం డీఆర్ఓ నిరంజన్, నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్ఓ నాగేశ్వర్రావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, నల్లగొండ తహసీల్దార్ అశోక్‌రెడ్డి తదితరులు బోకేలు అందజేసి అభినందనలు తెలిపారు.