50 వేల హెక్టార్లలో పంటనష్టం
ఎర్రవల్లిలో పంటల పరిశీలించిన జేడీ మాధవీశ్రీలత
జగదేవ్పూర్: రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలో నేటి వరకు 50 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయ సంచాలకులు మాధవీ శ్రీలత అన్నారు. శనివారం సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో సోయాబీన్ పంటలను ఆమె పరిశీలించారు. అనంతరం ఇటిక్యాలలో పత్తి, వరి పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కురిసిన అధిక వర్షాల వల్ల పంటల చాలా దెబ్బతిన్నాయన్నారు. రెండు రోజులుగా జిల్లాలో పర్యటిస్తూ పంటనష్టం అంచనా వేస్తున్నామన్నారు. జిల్లాలో అధికంగా సోయాబీన్ పంటకు నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఇలాగే వర్షాలు కురిస్తే పత్తి, కంది పంటలు చాలా వరకు దెబ్బతింటాయన్నారు.
ఎర్రవల్లిలో సోయాబీన్ చాలా వరకు దెబ్బత్నిదన్నారు. గింజ గట్టిపడే సమయంలో వర్షం పడడంతో పంట నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. పది రోజలయితే సోయాబీన్ పంట రైతుల చేతికందేందని తెలిపారు.
జిల్లాలో పంట నష్టం వివరాలు
జిల్లాలో ఇప్పటి వరకు పంట నష్టం వివరాలు ఇలా ఉన్నాయని జేడీ చెప్పారు. వరి- 3,100 వేల ఎకరాలు, మొక్కజొన్న 25 వేలు, పత్తి 11,700, సోయాబీన్ 6,800 వేలు, కంది 1,350, మినుము 140, జొన్న 64 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఇంకా పంట నష్టంపై సర్వే కొనసాగుతోందన్నారు.
వర్షాలు ఇలాగే పడితే మరింత నష్టం పెరుగుతుందన్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామన్నారు. రబీకి ప్రణాళిక తయారు చేశామని, శనగ విత్తనాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డాటా సెంటర్ శాస్త్రవేత్త శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, ప్రవీణ్ ఎఈఓ దామోదర్ తదితరులు ఉన్నారు.