బాబోయ్.. వద్దు!
కడప అగ్రికల్చర్ :
జిల్లాలోని గోడౌన్లలో ఎరువులు నిండుగా ఉన్నాయని, మళ్లీ కంపెనీల నుంచి ఎరువులు తెప్పించవద్దని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు డి ఠాగూర్ నాయక్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం నూతన కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో వివిధ ఎరువుల కంపెనీల ప్రతినిధులు, గోడౌన్ల మేనేజర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు ఖరీఫ్ అవసరాల నిమిత్తం 92 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటికే 41 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయని అన్నారు.
కేసీ కెనాల్‌కు నీరు వచ్చే వరకు ఎరువులు తెప్పించవద్దని ఖరాఖండిగా చెబుతున్నామన్నారు. ఈనెలలో కేసీకి నీరు రావచ్చనే సూచనలు ఉన్నట్లు ఉన్నాయన్నారు. అన్ని గోడౌన్లలో ఎరువులు నిల్వ ఉన్నాయని, ఎక్కువ నిల్వ చేయడానికి గోడౌన్లలో అడుగు కూడా స్థలం లేదన్నారు. గోడౌన్లలో స్టాక్ వారీగా, డీలర్ల వారీగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. నగేష్ గోడౌన్లో రాష్ట్ర వ్యవసాయశాఖలోని విజిలెన్స్ కమిటీ వచ్చి తనిఖీలు నిర్వహించగా స్టాక్ వారీగా రికార్డులు సక్రమంగా లేకపోవడంతోఎరువుల సరఫరాను నిలుపుదల చేశారన్నారు. ఏడీలు నరసింహారెడ్డి, జయరాణి, జేడీ కార్యాలయ టెక్నికల్ ఏఓ ప్రభాకరరెడ్డి, కడప ఏఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.