jds chief kumaraswamy
-
బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి
కర్ణాటక: జేడీఎస్ శాసనసభా పక్ష నేతగా మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం తాత్కాలిక స్పీకర్ ఆర్.వీ.దేశపాండే ఆఫీసులో జేడీఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి హెచ్.డీ.రేవణ్ణ, పార్టీలోని 19 మంది కొత్త ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీఎస్ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నారు. అనంతరం కుమార మాట్లాడుతూ ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని అన్నారు. -
‘హిందీ’ తేనెతుట్టెను కదిపిన అమిత్ షా!
న్యూఢిల్లీ/చెన్నై/కోల్‌కతా/బెంగళూరు: కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ‘హిందీ’ తేనెతుట్టెను కదిపారు. భారతదేశం మొత్తానికి ఒకే జాతీయభాష ఉండాల్సిన అవసరముందన్నారు. ఈ లోటును హిందీ తీర్చగలదని అభిప్రాయపడ్డారు. భారత్‌ను ఏకం చేయగల సత్తా హిందీకే ఉందన్నారు. ఢిల్లీలో శనివారం ‘హిందీ దినోత్సవం’ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తమిళనాడు, కర్ణాటక, బెంగాల్‌కు చెందిన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. హిందీని బలవంతంగా అమలుచేసేందుకు ప్రయత్నిస్తే దేశ సమగ్రతకే ప్రమాదమనీ, ఇండియా ముక్కలైపోతుందని హెచ్చరించాయి. అమిత్ షా వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని తమిళ రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. అధికార భాషల చట్టం–1963 ప్రకారం భారత పార్లమెంటు, ప్రభుత్వ వ్యవహారాల్లో హిందీ, ఇంగ్లిష్లను అధికార భాషలుగా గుర్తించారు. 1953 నుంచి ఏటా సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశంలో 44 శాతం మంది మాతృభాష హిందీయే. గాంధీ, పటేల్‌ల స్వప్నం అదే.. ప్రజలంతా తమ ప్రాంతీయ భాషలను వీలైనంత ఎక్కువగా వాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ‘భారత్ అనేక భాషలకు నెలవు. ప్రతీభాషకు తనదైన ప్రాధాన్యత ఉంటుంది. కానీ దేశం మొత్తంమీద ఒకే జాతీయభాష ఉండాల్సిన అవసరం చాలాఉంది. ఇది అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం దేశాన్ని ఏకం చేయగల సత్తా ఏ భాషకైనా ఉందంటే అది హిందీ మాత్రమే. ఎందుకంటే దేశంలో మెజారిటీ ప్రజలు హిందీ మాట్లాడుతారు. హిందీ భాష దేశాన్ని ఏకం చేయగలదు. దీనివల్ల విదేశీ భాషలు(ఇంగ్లిష్), సంస్కృతులు మనపై పెత్తనం చేయలేవు. కాబట్టి ప్రతిఒక్కరూ తమ ప్రాంతీయ భాషలను విరివిగా వాడండి. అదే సమయంలో హిందీని జాతీయభాషగా చేయాలన్న మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్‌ల స్వప్నాన్ని సాకారం చేయండి’ అని అమిత్ షా చెప్పారు. గాంధీ, పటేల్‌లు కూడా హిందీని జాతీయభాషగా చేయాలని దేశప్రజల్ని కోరారని షా గుర్తుచేశారు. భారత్‌లో 122 భాషలు, 19,500కుపైగా మాండలికాలు ఉన్నాయని షా గుర్తుచేశారు. కాగా, హిందీ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తాను హిందీని మాతృభాష స్థాయిలో ప్రేమిస్తానని హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తమిళనాడులో.. ఒకవేళ కేంద్రం మాపై హిందీని ఏకపక్షంగా రుద్దితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని తమిళనాడు సాంస్కృతిక శాఖ మంత్రి, అన్నాడీఎంకే నేత కె.పాండియరాజన్ హెచ్చరించారు. అమిత్ షా వ్యాఖ్యలు దేశ సమగ్రతకు భగం కలిగిస్తాయని డీఎంకే అధినేత స్టాలిన్ ఆందోళన వ్యక్తంచేశారు. అమిత్ షా వ్యాఖ్యలను సీపీఐ, పీఎంకే, ఏఎంఎంకేతో పాటు పలు ద్రవిడ పార్టీలు వ్యతిరేకించాయి. పశ్చిమ బెంగాల్లో.. ప్రజలు అన్ని సంస్కృతులను గౌరవించాల్సిందేనని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అయితే అందుకోసం మాతృభాషను పణంగా పెట్టాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు, హిందీ, హిందూ, హిందూత్వ కంటే భారత్ చాలా పెద్దదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. భారతీయులందరి మాతృభాష హిందీ కాదని స్పష్టం చేశారు. కర్ణాటకలో.. ‘మేం హిందీని వ్యతిరేకించట్లేదు. బలవంతంగా రుద్దడాన్నే తప్పుపడుతున్నాం’ అని కర్ణాటక కాంగ్రెస్ నేత సిద్దరామయ్య ట్వీట్‌చేశారు. జేడీఎస్ నేత కుమారస్వామి మాట్లాడుతూ..‘కేంద్రం హిందీ దినోత్సవాన్ని జరుపుతోంది. మిస్టర్ మోదీ.. మీరు కన్నడ దినోత్సవం ఎప్పుడు జరపబోతున్నారు? హిందీలాగే కన్నడ కూడా అధికార భాషే’ అని వ్యాఖ్యానించారు. అక్టోబర్ 1 నుంచి ఉద్యమిస్తామని కన్నడ సంఘాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. -
జేడీఎస్ గెలవకపోతే నేను బతకను: కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: ఎన్నికలకు కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. గురువారం ఆయన బెంగళూరు నగరంలోని ఆర్.ఆర్.నగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడారు. ‘నన్ను గెలిపిస్తే మిమ్మల్ని కాపాడతా, లేదంటే నేను ఎక్కువ రోజులు బతకను..జేడీఎస్ పార్టీ, మా భవిష్యత్ మీ తీర్పుపైనే ఆధారపడి ఉంది. జేడీఎస్‌కు అధికారమిస్తే కుటుంబ సభ్యుడిలా సేవలు చేస్తా.. కుమార స్వామి మరికొంత కాలం బతకాలని కోరుకుంటే జేడీఎస్‌కు అధికారం అప్పగించండి..’అంటూ ఉద్వేగంతో ప్రసంగించారు. -
కర్ణాటకలో మారుతున్న సమీకరణలు
సాక్షి, బెంగళూరు : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తూనే మరోవైపు కీలక నేతలతో పాటు, సినిమా నటులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. తాజాగా కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం ఆయన జేడీఎస్ రాష్ట్ర అధ్యకుడు హెచ్.డి కుమార స్వామితో సమావేశమయ్యారు. దీంతో సుదీప్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని సుదీప్ ఖండించారు. కుమారస్వామిని తాను మర్యాదపూర్వకంగానే కలిశానని పేర్కొన్నారు. కాగా రాజకీయ విషయాల పైనే రెండు గంటలపాటు సుదీప్తో చర్చించామని జేడిఎస్ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. గతంలో జేడీఎస్ అధి నేత దేవగౌడ సుదీప్‌ని పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. మరో వైపు బీజేపీకి చెందిన మాజీ మంత్రి హరతాళ్ హాలప్ప కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మరో బీజేపీ మాజీ మంత్రి కూడా హస్తం అందుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం మాజీ బీజేపీ మంత్రి బీఎస్ అనంద్ సింగ్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇలా అన్ని పార్టీల నుంచి వలసలు, కొత్త వాళ్లు రాజకీయాల్లోకి రావడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెతిస్తున్నాయి. -
తల్లి చివరి కోరిక కోసం..
కర్ణాటకలో కేన్సర్‌తో బాధపడుతున్న ఓ తల్లి.. తన కొడుకును ఓ చిత్రమైన కోరిక కోరింది. అతడు కూడా దాన్ని తీర్చడానికి కాస్త కష్టపడినా.. చివరకు తీర్చాడు. బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకా మాకనడకు గ్రామ నివాసి లలితమ్మ కేన్సర్ బాధితురాలు. ఆ తల్లి వెల్లడించిన తన చివరి కోరికను ఆమె కుమారుడు కిరణ్‌కుమార్ నెరవేర్చాడు. జేడీఎస్ పార్టీలో కొనసాగుతున్న కిరణ్‌కుమార్ తల్లి లలితమ్మకు తాను చనిపోయేలోగా జేడీఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ.కుమారస్వామిని ఒకసారైనా చూడాలన్న కోరిక కలిగింది. ఆ కోరిక గురించి కిరణ్‌కుమార్ తమ పార్టీ అధ్యక్షునికి ఫోన్లో వివరించగా, చెళ్లకెరె పర్యటనకు వచ్చిన ఆయన అందుకు సమ్మతించి, వెంటనే తల్లితో కలిసి చెళ్లకెరె బయలుదేరి రావాలని సూచించారు. దీంతో ఆయన చెళ్లకెరెలో జరిగిన జేడీఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తర్వాత అక్కడకు వచ్చిన లలితమ్మను పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుమారస్వామితో మాట్లాడినందుకు తనకు ఎంతో సంతోషం కలిగిందని లలితమ్మ ఆనందం వ్యక్తం చేసింది.