‘దళం’లో తిరుగు బావుటా ?
పార్టీలో చిచ్చురేపిన రాజ్యసభ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ
జేడీఎల్పీ సమావేశానికి గైర్హాజరైన ఐదుగురు అసంతృప్త ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ అభ్యర్థికే మద్దతని తేల్చిచెప్పిన వైనం
డిగ్గీని కలవడానికి ఢిల్లీకి ఆ ఐదుగురు !
బెంగళూరు : రాజ్యసభ ఎన్నికల సందర్భంగా దళం పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. దీంతో ఆ పార్టీ లుకలుకలు మరోసారి బయట పడ్డాయి. అంతేకాకుండా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామిపై గుర్రుగా ఉన్న ఐదుగురు శాసనసభ్యులు గురువారం సాయంత్రం జరిగిన జేడీఎస్ పార్టీ శాసనసభ పక్ష (జేడీఎల్పీ) సమావేశానికి గైర్హాజరు కావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే తమ ఓటు అని ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ఎదుట తేల్చిచెప్పడంతో పార్టీలో కలకలం రేగింది. రాష్ట్ర శాసనసభ నుంచి రాజ్యసభకు వచ్చేనెల 11న పోలింగ్ జరగనుండగా నామినేషన్ వేయడానికి ఈ నెల 31 వరకూ మాత్రమే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల విషయమై చర్చించడానికి జేడీఎస్ పార్టీ బెంగళూరు శివారులోని నెలమంగళలో ఉన్న గోల్డెన్ఫామ్ రిసార్టులో గురువారం సాయంత్రం జేడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలైన జమీర్‌అహ్మద్‌ఖాన్, చలువరాయస్వామి, అఖండ శ్రీనివాస్‌మూర్తి, బాలకృష్ణ, ఇక్బాల్అన్సారీలు గైర్హాజరయ్యారు. ఈ విషయమై జేడీఎల్పీ సమావేశానికి ముందు దేవెగౌడ మాట్లాడుతూ...‘ప్రస్తుతం పార్టీ బలోపేతం చేయడం ప్రస్తుత లక్ష్యం. జేడీఎల్పీ సమావేశానికి జమీర్ అహ్మద్‌ఖాన్ కాని మరొకరు కాని రాకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు.’ అని అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా వీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాకుండా రాజ్యసభ ఎన్నికల సందర్భంగా వీరు కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారన్న వార్తలు వెలువబడుతున్నాయి. దీంతో వీరి గైర్హాజరిని ముందే పసిగట్టిన ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి అసంతృప్త ఎమ్మెల్యేలను బుధవారం రాత్రి బెంగళూరులోని ఓ హోటల్లో ప్రత్యేకంగా సమావేశమై బుజ్జగించడానికి ప్రయత్నించారు. అయితే వారు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. అంతే కాకుండా అంతేకాకుండా తాము కాంగ్రెస్ పార్టీ మూడో అభ్యర్థి కే.సీ రామమూర్తికి మద్దతు ఇస్తామని జమీర్ అహ్మద్‌ఖాన్ కుమారస్వామితో పేర్కొన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్‌తో మాట్లాడటానికి త్వరలో ఢిల్లీ వెలుతున్నట్లు ఆయన కుమారస్వామి ముందు కుండబద్దలు కొట్టారు. దీంతో చేసేదేమిలేక కుమారస్వామి వెనుదిరిగారని విశ్వసనీయ వర్గాల సమాచారం.