పురస్కారం - తిరస్కారం
చరిత్ర
1964లో స్వీడిష్ అకాడమీ నోబెల్ సాహిత్య పురస్కారాన్ని సుసంపన్నమైన భావాలతో, స్వతంత్ర కాంక్షా భరితమై, సత్యశోధనతో మన యుగంపై గొప్ప ప్రభావాన్ని చూపిన రచనలు చేసినందుకు ఫ్రెంచి రచయిత జా పాల్ సార్త్రకు ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా, ఈ బహుమానాన్ని స్వీకరించేందుకు సుముఖంగా లేనని సార్త్ర తెలియజేశారు. ఈ గౌరవాన్ని సార్త్ర తిరస్కరించిన కారణాన ఈ పురస్కార ప్రాధాన్యత ఏమాత్రం వికృతీకరించబడదు. ఈ పరిస్థితులలో, బహుమతి ప్రదానోత్సవం జరగదని మాత్రమే అకాడమీ పేర్కొనగలదు.
LE FIGARO అక్టోబర్ 23, 1964 ప్రతిలో ప్రచురితమైన ఒక బహిరంగ ప్రకటనలో సార్త్ర తానీ పురస్కారాన్ని తిరస్కరించడం వివాదం కావడం పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. స్వీడిష్ అకాడమీ ఒకసారి తీసుకున్న నిర్ణయపు అనుక్రమణీయత తెలియని కారణాన, తనను ఈ బహుమానానికి ఎన్నుకోవలదని ఒక లేఖ ద్వారా స్వీడిష్ అకాడమీని కోరినట్లు సర్వులకు తెలియాలని సార్త్ర అభిలషించారు. తనకు స్వీడిష్ అకాడమీని కించపరిచే ఉద్దేశం లేదని, తన నిరాకరణ ఆత్మగత, ఇతరేతర కారణాల ప్రేరితం అని సార్త్ర ఈ లేఖలో సూచించారు.
ఆత్మగత కారణాలకు సంబంధించి, రచయిత కర్తవ్యం గురించి తీసుకున్న భావన మూలంగా తానెప్పుడూ అధికారిక పురస్కారాలను తిరస్కరిస్తూనే వచ్చానని సార్త్ర పేర్కొన్నారు. అంతకుముందు కూడా సార్త్ర LEGION OF HONOUR లో సభ్యత్వాన్ని నిరాకరించి COLLEGE DE FRANCE ప్రవేశాన్ని అభిలషించలేదు. అంతేకాదు, లెనిన్ ప్రైజ్‌ను తనకివ్వజూపినా, దాన్ని కూడా తిరస్కరిస్తానని సార్త్ర అన్నారు. ఈ విధమైన గౌరవాన్ని ఆమోదించడం రచయిత తన వ్యక్తిగత పూచీలను, బాధ్యతలను బహుమతి ప్రదానం చేసిన వ్యవస్థతో సహచరితం చేయడమే. రచయిత ఎటువంటి పరిస్థితిలో కూడా తనను తాను ఒక వ్యవస్థగా పరివర్తన చెందేందుకు అనుమతించకూడదు. ఇతర కారణాలకు సంబంధించి సార్త్ర ఒక పట్టికనిచ్చారు. ఏ వ్యవస్థల జోక్యం లేకుండా ప్రాక్పశ్చిమాల ప్రజల మధ్య, సంస్కృతుల మధ్య, ఆదాన ప్రదానాలు జరగాలని తన నమ్మిక అని సార్త్ర పేర్కొన్నారు.
అంతేకాదు తన అభిప్రాయంలో, గతంలో ఈ పురస్కారం అన్ని భావజాలాలకు, అన్ని జాతులకు సమాన ప్రాతినిధ్యం వహించలేదు. ఇటువంటి స్థితిలో తానీ బహుమానాన్ని ఆమోదించడం, అవాంఛనీయ, అన్యాయపూరిత విమర్శలకు తావియ్యవచ్చు అని ఆయనన్నారు. స్వీడిష్ అకాడమీకి ఒక ప్రేమపూర్వక సందేశంతో సార్త్ర తన లేఖను ముగించారు.
(స్వీడిష్ అకాడమీ సభ్యుడు ఏండర్స్ ఆసర్లింగ్ ద్వారా)
- మువ్వల సుబ్బరామయ్య
8978261496