టీచర్ల వీరంగన్
‘‘చిన్నవాడి చేతిలోన గన్ను... పేలినదా చంపేను నన్ను’’ అంటూ ఆ స్కూలు స్కూలంతా గజగజ వణికిపోయింది. ఇంగ్లండ్‌లోని సోమర్సెట్, ఫ్రోమ్ ప్రాంతంలో ఉన్న సెల్‌వుడ్ అకాడమీ స్కూల్ చాలా స్ట్రిక్ట్ రూల్స్‌తో నడుస్తుంది. ఆ స్కూల్లో జేడాన్ అనే పదేళ్ల కుర్రాడు చదువుతున్నాడు. గత 27న ఆ కుర్రాడు తరగతి గదిలోకి చేతిలో తుపాకీతో ప్రవేశించాడు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో టీనేజర్లు పిస్తోలుతో వీరంగాలు వేసి, సంచలనం సృష్టించిన నేపథ్యంలో జేడాన్ చేతిలో తుపాకీ చూసిన సెల్‌వుడ్ స్కూల్ టీచర్లు చలి జ్వరం వచ్చినట్టు వణికిపోయారు. ముగ్గురు టీచర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాఠశాల నుంచి జేడాన్ని సస్పెండ్ చేసేశారు. పోలీసు అధికారులు జేడాన్ ఇంటికి వచ్చి మరీ కౌన్సిలింగ్ నిర్వహించారు.
మార్చి 9 దాకా జేడాన్ ఇల్లు విడిచి బయటకు వెళ్లకూడదని ఓ రకంగా హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ ఉదంతంతో జేడాన్ తల్లి నటాషా డిప్రెషన్లోకి వెళ్లి మంచమెక్కింది. ఇంతా చేస్తే జేడాన్ తీసుకెళ్లింది బొమ్మ తుపాకీయే. ఈ విషయాన్ని చెప్పిన జేడాన్ సవతి తండ్రి... ‘‘పెద్దగా శబ్దం కూడా చేయని ప్లాస్టిక్ తుపాకీని కారణంగా చూపి ఇంటికి పోలీసులు రావడం, మా అబ్బాయికి కాల్పుల మీద క్లాస్ తీసుకోవడం, స్కూల్ నుంచి సస్పెండ్ చేయడం న్యాయం కాదని, వెంటనే సస్పెన్షన్ ఎత్తేయాలని’’ వేడుకుంటున్నాడు. జేడాన్ గతంలో మంచి ప్రవర్తనకు గాను అవార్డు కూడా అందుకున్నాడని గుర్తు చేస్తున్నాడు.
సత్యవర్షి