ఆహ్లాదంగా జెక్‌ఫెస్ట్ వేడుకలు
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : స్థానిక గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న ‘ప్రత్యేక జెక్‌ఫెస్ట్- 2014’ వేడుకలు ఉత్సాంగా సాగుతున్నాయి. గురువారం రాత్రి నిర్వహించిన కళా ప్రదర్శనలు, శుక్రవారం జరిగిన సాంకేతిక ప్రదర్శనలు, క్రీడా పోటీలు విద్యార్థుల్లో ఉత్సాహం నింపాయి. గురువారం రాత్రి కళాశాల చైర్మన్ డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాశి కంటే వాసి గొప్పదని భావించి, ప్రాచీన కళల్లో వాసికెక్కిన కళాకారులతో తమ కాలేజీలో ప్రదర్శనలు ఇప్పించి, వారిని సన్మానించడం ఏటా జెక్ఫెస్ట్లో వస్తున్న ఆచారమని పేర్కొన్నారు.
అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఆరుపదుల పైబడిన వయసులో పద్మశ్రీ కుంకుమ మొహంతి తన బృందంతో చేసిన ఒడిస్సీ నృత్యం ఆకట్టుకుంది. అనంతరం మొహంతిని కాలేజీ యాజమాన్యం సత్కరించింది. గాయకుడు ఎల్.వి.గంగాధరశాస్త్రి తన బృందంతో ‘ఘంటసాల వెంకటేశ్వరరావు నీరాజనం’ కార్యక్రమం నిర్వహించారు. రైతు వ్యక్తిత్వం, పుడమితల్లి పులకరింతలపై సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ప్రసంగించారు. శుక్రవారం జెక్‌ఫెస్ట్ రోబోరేస్ తదితర ఆసక్తికర అంశాలతో ఉత్సాహభరితంగా జరిగింది.
ఉత్కంఠభరితంగా జాతీయ క్రీడలు...
జీఈసీలో జాతీయస్థాయి క్రీడాపోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఇంజినీరింగ్ కాలేజీల క్రీడాకారులు తలపడుతున్నారు. ఈ పోటీలు శుక్రవారం సెమీ ఫైనల్‌కు వచ్చాయి. ఫైనల్స్ ఫలితాలు శనివారం వెలువడనున్నాయి.
వాలీబాల్‌లో సెమీ ఫైనల్స్‌కు చేరిన కాలేజీలు
భీమవరం విష్ణు కాలేజీపై కోరంగి కేఐఈటీఐ, నరసరావుపేట ఎన్ఈసీపై జగ్గయ్యపేట మండవ ఇంజినీరింగ్ కాలేజీ, ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజీపై చెవుటూరు శ్రీవాణి ఇంజినీరింగ్ కాలేజీ, జూపూడి నిమ్ర కాలేజీపై విజయవాడ పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కాలేజీ, తేలప్రోలు ఉషారామాపై విశాఖపట్నం రఘు, గంగూరు ధనేకులపై సూరుపాలెం ఆదిత్య, తాడేపల్లిగూడెం శ్రీవాసవీపై ఏలూరు రామచంద్ర, లంకపల్లి సన్‌ఫ్లవర్‌పై నందమూరు వాసవీ, నూజివీడు ఆర్ఐఐఐటీపై చీరాల సెయింట్ ఆన్స్ కాలేజీ జట్లు విజయం సాధించి సెమీస్‌కు చేరాయి.
బాస్కెట్ బాల్లో...
గంగూరు ధనేకుల ఇంజినీరింగ్‌పై కాకినాడ కైట్, సాయి స్ఫూర్తిపై మైలవరం లకిరెడ్డి బాలరెడ్డి, నూజివీడు ఎస్ఎస్ఐటీపై సత్తెనపల్లి నలంద, వైటీమ్పై భీమవరం ఎస్ఆర్కేఆర్, జూపూడి నిమ్రాపై లంకపల్లి సన్‌ఫ్లవర్, భీమవరం విష్ణుపై నందమూరు శ్రీవాసవీ, కేఎల్ యూనివర్సిటీపై విజయవాడ లయోలా, శ్రీరామచంద్రపై నరసరావుపేట, నూజివీడు ట్రిపుల్ ఐటీపై ఖమ్మం ఎవీఐటీ, ఏలూరు సీఆర్రెడ్డిపై రఘు, శ్రీవాసవీపై ప్రగతి, ఎంవీఆర్‌పై కాకినాడ కైట్, విశాఖపట్నం రఘుపై హైదరాబాద్ సెయింట్ మార్టిన్ కాలేజీ జట్లు విజేతలుగా నిలిచి సెమీస్‌కు చేరాయి.