గాలిలో 144 మంది.. పేలిన విమానం ఇంజన్!
ఫిలిడెల్ఫియా : గగనతలంలో అనూహ్యరీతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ అమెరికా విమానం ఇంజన్ మధ్యలో పేలిపోయింది. ఆ ఇంజన్ శకలం దూసుకొచ్చి.. విమానం కిటికీని ఢీకొట్టింది. దీంతో విమానానికి రంధ్రం ఏర్పడి.. ప్రయాణికుల్లో తీవ్ర భయోత్పాతాన్ని సృష్టించింది. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోగా, ఏడుగురు గాయపడ్డారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ చెందిన విమానం గాలిలో ఉండగా ఒక్కసారిగా ఇంజన్ పేలిపోయింది. ఇంజన్ శకలం దూసుకొచ్చి కిటికీని ఢీకొట్టడంతో.. కిటికీ పక్కనే సీట్లో కూర్చున్న మహిళ తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. అయితే, పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి.. వెంటనే సమీపంలో ఉన్న ఫిలడెల్ఫియా విమానాశ్రయంలో విమానాన్ని దింపడంతో పెనుప్రమాదం తప్పింది. పెద్దసంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
డల్లాస్ నుంచి 144 మంది ప్రయాణికులతో బయలుదేరిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ 1380 ఫిలిడెల్ఫియాలో అత్యవసరంగా దిగింది. విమానం ఇంజన్ ఒక్కసారిగా పేలడం.. విమానానికి రంధ్రం పడటంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళలకు గురైయ్యారు. అతి కష్టం మీద విమాన సిబ్బంది ఆ రంధ్రాన్ని మూసివేశారు. ఈ సందర్భంగా విమానంలోకి గ్యాస్ ప్రవేశించడంతో ఊపిరాడక ప్రయాణికులు తీవ్ర అవస్థపడ్డారు. వారికి అత్యవసరంగా సిబ్బంది ఆక్సీజన్ మాస్కులు అందించారు. ఈ ఘటనలో మృతిచెందిన మహిళను జెన్నిఫర్ రియోర్డాన్ గుర్తించారు. ఆమె బ్యాంకు ఉద్యోగి. ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మా ప్రాణాలు కాపాడు దేవుడా.. అని ప్రార్థించాం
గాలిలో ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. విమానం ఫిలడెల్ఫియా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యేంతవరకు ప్రార్థనలు చేస్తూ.. భయాందోళనతో గడిపారు. ‘విమాన ప్రమాదం జరిగిన తరువాత మాకు గాలి ఆడలేదు. ఒక్కసారిగా ఆక్సిజన్ ముసుగులు తెరుచుకున్నాయి. మా ప్రాణాలు కాపాడు దేవుడా అని అందరం ప్రార్ధించాం’ అని న్యూయార్క్ ప్రయాణికుడొకరు తెలిపారు.
ప్రమాదం జరిగిందని తెలిసిన తరువాత తన భర్త చేతిని గట్టగా పట్టుకున్నానని, ఆ సమయంలో తన పిల్లల గుర్తుకు వచ్చారని, మళ్ళి వాళ్ళను తిరిగి చూడగలనా అన్న భయం కలిగిందని ఓ ప్రయాణికురాలు తెలిపారు. ప్రమాదంలో మరణిచిన రియోర్డాన్ న్యూ మెక్సికో విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్. ఆమె గతంలో సమాజ సంబంధాల రంగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2009 నుంచి సౌత్‌వెస్ట్ ఏయిర్ లైన్స్‌లో ఇలాంటి ప్రమాదం జరగటం మొదటిసారి అని సంస్థ సిబ్బంది తెలిపారు. విమానం 30,000 వేల అడుగులో ఉండగా ఇంజన్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించామని, ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో గ్యాస్ లీకైందని విమాన సిబ్బంది తెలిపారు. గ్యాస్ లీకైన వెంటనే విమానంలో ఆక్సిజన్ మాస్క్‌లు తెరుచుకున్నాయని, లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదన్నారు. తరువాత ప్రయాణికులను సౌత్‌వెస్ట్ బోయింగ్ 737-700 విమానంలో ప్రయాణికులను లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌కు సురక్షితంగా తరలించామని సౌత్‌వెస్ట్ విమాన అధికారులు తెలిపారు.