ముంబైలోని ట్రంప్ టవర్స్‌కు జెట్ సర్వీసులు
ముంబై: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల అభ్యర్థిగా పోటీ పడుతున్న శత కోటీశ్వరుడు డొనాల్డ్ ట్రంప్ ముంబై నగరంలో ట్రంప్ టవర్స్ పేరిట లగ్జరీ టవర్లను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. వీటిలో నివసించేవారికి ప్రైవేట్ జెట్ సర్వీసులను అందజేస్తామని తాజాగా ప్రకటించారు. ప్రైవేట్ జెట్ సర్వీసులు ఇంతవరకు భారత దేశంలోనే లేవు. క్రెకెట్ స్టేడియం, సినిమా థియేటర్, అంపీ థియేటర్, అథ్లెటిక్ ట్రాక్స్, స్పా బాత్‌లు, స్పాలు, స్మిమ్మింగ్ పూల్స్, జలపాతాలు, రిసార్ట్స్ లాంటి సౌకర్యాలతో మొత్తం 17 ఎకరాల్లో 800 అడుగుల ఎత్తై ట్రంప్ టవర్స్‌ను నిర్మిస్తున్నారు. 75 అంతస్థులుండే ఈ టవర్స్‌లో 400 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు.
ముంబైకి చెందిన లోధా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ టవర్స్ 2018 సంవత్సరం నాటికి పూర్తవుతాయి. మూడు పడక గదుల ఫ్లాట్‌ను 9.10 కోట్లకు, ఐదు పడక గదులు కలిగిన ఫ్లాట్‌ను పదిన్నర కోట్ల రూపాయలకు విక్రయించాలని తాత్కాలికంగా నిర్ణయించారు. ముంబై నగరంతోపాటు పుణెలో కూడా ట్రంప్ టవర్స్‌ను నిర్మిస్తున్నారు.