కత్తిపీట మీద సామే
- మండుతున్న కూరగాయల రేట్లు
- ఉష్ణోగ్రత కారణంగా తగ్గిన దిగుబడి
- ఉల్లిపాయల ధరా అదే దారిలో..
అమలాపురం, న్యూస్‌లైన్ : తగలబడుతున్న కారడవి నుంచి వీస్తున్నట్టు గాలి పగలూ, రాత్రీ సెగలు కక్కుతోంది. నీడ పట్టున ఇంట్లోనే ఉన్నా.. పగబట్టినట్టు వాతావరణం హింసిస్తోంది. ఇక.. కూరో, వేపుడో వండుతూ వంటిళ్లలో మండే స్టౌల ముందుండే ఇల్లాళ్ల అవస్థ చెప్పనక్కరలేదు. అక్కడున్నంతసేపూవారికి చిత్రహింసగానే ఉంటోంది. ఉల్లి ఘాటుకు మండుతున్న కంట్లోనే నలుసు పడ్డట్టు- ఇప్పుడా అవస్థకు భగ్గుమంటున్న కూరగాయల ధరలు తోడయ్యాయి. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాల మహిళలు వంటింటి బడ్జెట్‌ను నిర్వహించలేక సతమతమవుతున్నారు.
కిలో కూరగాయలు కొనే వారికి అర కిలోతోనో, పావుకిలోతోనో సరిపెట్టుకోక తప్ప డం లేదు. దాంతో ఇంటిల్లిపాదికీ కడుపారా తినేందుకు కూర వండి పెట్టడం ఆ ఇల్లాళ్లకు ‘కత్తిపీట మీద సాము’గా మారింది. ఇంట వండిన కూర రుచిగా ఉన్నప్పుడు మారు వడ్డించమనడం ఎవరికైనా ఉన్న అలవాటే. అలా అడిగిన వారికి అడిగినంత కూర వడ్డించడం ఇప్పుడు ఇల్లాళ్లకు శక్తికి మించిన పనిగా పరిణమించింది.
జిల్లాలో వారం, పదిరోజులుగా మడికి హోల్‌సేల్ మార్కెట్లో, చిల్లర వ్యాపారాల్లో కూరగాయల ధరలు రోహిణీ కార్తెలో ఉష్ణోగ్రతలాగే దినదినాభివృద్ధి చెందుతున్నాయి. బీర, క్యారెట్, బీట్రూట్ వంటి వాటి ధరలు ఇప్పటికే సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. వీటి ధర కేజీ రూ.40 నుంచి రూ.42 వరకు ఉంది. కొన్ని చోట్ల బీర ధర రూ.45 కూడా దాటింది. టమాటా, బెండకాయలు కేజీ రూ.32 నుంచి రూ.35, క్యాబేజీ, వంకాయలు రూ.24 వరకు, బంగాళదుంప, దొండకాయ రూ.20 చొప్పున అమ్ముతున్నారు.
ఇక.. నగల తయారీలో బంగారానికి రాగి కలవడం ఎంత తప్పనిసరో.. ఏ కూర వండాలన్నా అంతే తప్పనిసరైన ఉల్లిపాయలు కూడా ‘మేము మాత్రం తక్కువ తిన్నామా’ అన్నట్టు ధర విషయంలో మిడిసిపడుతున్నాయి. వాటి నాణ్యతను బట్టి రూ.20 నుంచి 24 వరకు పలుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 సెంటీగ్రేడ్ డిగ్రీలకు పైబడి ఉండడంతో కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గిందని, దానికి తోడు మండే ఎండల్లో కూరగాయల కోతకు వచ్చేందుకు కూలీలే జంకుతుండడంతో ఎక్కువ కూలి ఇచ్చి కోయించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.
కాగా మడికి హోల్‌సేల్ మార్కెట్‌కు ప్రస్తుతం.. ఎప్పుడూ వచ్చే కూరగాయల్లో 60 శాతమే వస్తున్నాయని అక్కడి వ్యాపారులు చెపుతున్నారు. తొలకరి వర్షాలు పడి, ఉష్ణోగ్రతలు త గ్గి కాయగూరల దిగుబడి ఎంతోకొంత పెరిగే వరకూ ధరలు దిగి వచ్చే అవకాశం లేదంటున్నారు. అంటే.. మరికొన్ని రోజులు కూడా రెండుపూటలా నోరారా తినడం అంటే సామాన్యుల జేబుకు మించిన భారం కాక తప్పదన్న మాట.