వికాసం: తండ్రి - కొడుకు - సైకిల్
‘‘పది నిమిషాల్లో ఈ లెక్ఖ చేస్తే ఎప్పటినుంచో నువ్వు అడుగుతున్న సైకిల్ కొనిపెడతాను. ఒకవేళ చెయ్యలేకపోతే రేపు శని, ఆదివారాల్లో వంట పనంతా నువ్వు చేసి, అమ్మకి విశ్రాంతి ఇవ్వాలి’’ అని ఒక తండ్రి తన కొడుకుని ఉత్సాహపరిచాడు. కొడుకు ఆ ఛాలెంజ్‌కి ఒప్పుకున్నాడు.
ఫిజిక్స్ టీచరైన ఆ తండ్రి, కొడుకుని ఈ విధంగా ప్రశ్నించాడు. ‘‘ఆఫ్గనిస్తాన్ ముఖ్య పట్టణమైన కాబుల్ నుంచి పొద్దున ఎనిమిది గంటలకి ‘డిజర్ట్ ఎక్స్‌ప్రెస్’ గంటకి 80 మైళ్ల వేగంతో ఇస్లామాబాద్ వైపు బయలుదేరింది. పాకిస్తాన్ ముఖ్య పట్టణమైన ఇస్లామాబాద్ నుంచి పొద్దున తొమ్మిదింటికి ‘తుఫాన్ మెయిల్’ గంటకి 60 మైళ్ల వేగంతో కాబుల్ వైపు బయలుదేరింది. కాబుల్‌కి, ఇస్లామాబాద్‌కి మధ్య దూరం 480 మైళ్లు అయితే, రెండు రైళ్లూ మధ్యలో పెషావర్ దగ్గర కలుసుకున్నప్పుడు, ఏ ఇంజన్ కాబుల్‌కి దగ్గరగా ఉంటుంది?’’
ఆ కుర్రవాడు ‘కాలము-దూరము’పై రకరకాల లెక్కలు వేసి బుర్ర బద్దలు కొట్టుకుని చివరికి ఆ ప్రశ్న లెక్కలకి సంబంధించినది కాదనీ, ఇంగిత జ్ఞానానికి (కామన్సెన్స్) సంబంధించినదనీ తెలుసుకొని, ‘ఒకే స్టేషన్లో ఆగి ఉన్నప్పుడు రెండూ కాబుల్‌కి ఒకే దూరంలో ఉంటాయి’’ అని చెప్పాడు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం కొడుక్కి సైకిల్ ఇవ్వటానికి ఒప్పుకుంటూ, ‘‘సైన్సు, లెక్కలు తర్కం మీద ఆధారపడి ఉంటాయి. ఆ విధంగా నువ్వు కరెక్టే. కాని ప్రశ్నని అర్థం చేసుకోవడం ఇంకా ముఖ్యం. నా ప్రశ్న నువ్వు సరిగ్గా వినలేదు. నేను ఇంజన్ గురించి అడిగానే తప్ప రైలు గురించి కాదు. కాబుల్ వైపు వెళ్తూన్న రైలు తాలూకు ఇంజన్ కాబుల్‌కి దగ్గరగా ఉంటుంది. నువ్వు ఇంకా బాగా ఆలోచించి ఉంటే మరొక విషయం కూడా అర్థమయ్యేది. దాన్ని భౌగోళిక పరిజ్ఞానంతో కూడిన కామన్సెన్స్ అంటారు. ఆఫ్గనిస్తాన్‌లో అసలు రైళ్లే లేవు.’’
తన తప్పు అర్థం చేసుకున్న ఆ కుర్రవాడు రెండు రోజులపాటు వంటింటి పని చేపట్టాడు. ఆ కుర్రవాడి పేరు జాన్ ఎల్. హాల్! అతడే పెద్దయ్యాక, ఫిజిక్స్‌లో నోబుల్ ప్రైజ్ సంపాదించాడు. పై ఉదాహరణలో నాలుగు ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి.
1. చదువు వేరు, జ్ఞానం వేరు. పాఠశాలల్లో కేవలం చదువే చెబుతారు. పిల్లవాడికి జ్ఞానాన్ని పెంపొందించే విషయాలు బోధించవలసిన బాధ్యత తల్లిదండ్రులది.
2. చదువుకుంటున్న వయసులో కూడా పిల్లలు ఇంటి పనుల్లో బాధ్యత వహించేలా చెయ్యాలి.
3. పిల్లల తెలివితేటల్ని జ్ఞానాన్ని గుర్తించి, ఆ గుర్తింపుకి తగిన బహుమతులు ఇస్తూండాలి.
4. ఉత్సాహకరమైన ప్రశ్నలు వేసి ప్రోత్సాహపరిచేకొద్దీ పిల్లల్లో చదువంటే అలసత్వం, భయం పోయి చురుకుతనం పెరుగుతుంది.
తన ఆత్మకథలో జాన్ హాల్ ఒకచోట ‘పిల్లవాడు టీవీలో గంటల తరబడి ఫుట్‌బాల్ మ్యాచ్ చూడకుండా ఉండాలి అంటే గెలుపు కన్నా మంచి ఆనందం లేదు’ అన్న విషయం అతడికి తెలిసేలా చెయ్యాలి. ఒక లెక్క సాల్వ్ చేసినా, ఒక జోకు సొంతగా తయారుచేసినా దానికి బహుమతి ఇస్తే, పిల్లలు మత్తు కలిగించే అభిరుచుల నుంచి, అభివృద్ధినిచ్చే అలవాటువైపు మారుతారు’’ అంటాడు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చిన్నపిల్లల కంటే టీనేజ్లోనే పిల్లలకి పెద్దల అవసరం ఎక్కువ ఉంటుందట. ఆ టీనేజ్ వయసులో ఏడుగురు పిల్లల్లో ఇద్దరు... ఒంటరితనం, ఓవర్ కాన్ఫిడెన్స్, పిరికితనం, డిప్రెషన్ లేదా అతివాగుడు అనే రుగ్మతలతో, కనీసం అందులో కొన్నిటితో బాధపడుతూ ఉంటారని సైకాలజిస్టులు చెబుతారు.
పదిలో కనీసం ముగ్గురు తల్లితో గానీ, తండ్రితో గానీ సరిగ్గా మాట్లాడరట. కూతురు ప్రేమలో పడిందని తెలియగానే సమాజాన్నీ సినిమాల్నీ తిడతారు ఇంట్లోవారు. దానికి తామే కారణమని ఒప్పుకోరు. ఇంట్లో సంబంధాలు (ముఖ్యంగా తండ్రితో) బావుంటే ఆడపిల్లలు బయట ప్రేమని వెతుక్కోరు. ‘ఈ ఇంట్లోంచి ఎంత తొందరగా బయటపడదామా’ అన్న ఆలోచనే ఆడపిల్లల్ని అతి చిన్న వయసులో ప్రేమలో పడేలా చేస్తుంది.
- యండమూరి వీరేంద్రనాథ్