ఐదుగురిని బలిగొన్న క్షణికావేశం...
* ముగ్గురు పిల్లలను, భార్యను చంపి భర్త ఆత్మహత్య
* అనాథలైన ముగ్గురు చిన్నారులు
సాక్షి, బెంగళూరు : ఆర్థిక సమస్యలు... అటుపై ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య మనస్పర్థలు కారణంగా క్షణికావేశంలో తీసుకున్న ఓ వ్యక్తి నిర్ణయం ఐదుగురిని బలితీసుకుంది. ముగ్గురు పిల్లలను అనాథలను చేసింది. ఈ హృదయ విదారక ఘటన బెంగళూరు శివారులోని జిగణి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు....తుమకూరు జిల్లా శిరాకు చెందిన ఫయాజ్ (35) ఉపాధి కోసం పదిహేడేళ్ల క్రితమే బెంగళూరుకు వచ్చాడు.
పెయింటర్‌గా పనిచేసే ఫయాజ్‌కు బొమ్మనహళ్లి సమీపంలోని బేగూరు వద్ద ఉంటున్న కవితా అలియాస్ రేష్మా (30) పరిచయమైంది. పరిచయం ప్రేమకు దారితీసి పెద్దలను ఎదురించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరుగురు సంతానం. మొదట్లో వచ్చిన సంపాదనతో కుటుంబం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుండేది. అయితే సంతానం పెరడగంతో వచ్చిన ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక ఫయాజ్ ఇబ్బందులు పడేవాడు.
ఈ విషయాన్నే సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడేవాడు. మరోవైపు భార్యభర్తల మధ్య ఇటీవల మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా నాలుగు రోజుల ముందు ఫయాజ్ బెంగళూరు నుంచి మంచేనహళ్లికి మకాం మార్చాడు. శనివారం దంపతుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. పనిపై బయటికి వెళ్లి రాత్రి ఫయాజ్ ఇంటికి చేరుకున్నాడు. భార్య పిల్లలు మహబూబ్ (5), ఉసాద్ (2), సాదల్ (11 నెలలు) నిద్రపోతూ కనిపించారు.
అంతే క్షణికావేశంతో ఇంటి తలుపులు వేసి ముగ్గురిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కొద్ది సేపటి తర్వాత ఇంటి నుంచి పొగలు రావడంతో చుట్టపక్కల వారు ఇంటి తలపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లే సరికి చేతిలో కత్తితో ఉన్న ఫయాజ్ గొంతు కోసుకున్నాడు. హుటాహుటిన బాధితులను ఆసుపత్రికి చేర్చగా అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో ముగ్గురు పిల్లలు సంఘటన జరిగిన సమయంలో పక్కన ఉన్న ఇంటికి వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, భార్య, పిల్లలకు నిప్పంటించినప్పుడు వారు అరుపులు ఎందుకు బయటికి వినిపించలేదు అన్న దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. కిరోసిన్ లేదా మంటలు పుట్టించే మరో ద్రావకం ఏదైనా ఉపయోగించాడే అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.